కాంగ్రెస్ కథ మళ్ళీ మొదటికి వచ్చిందా ? నేతల మద్య మళ్ళీ కోల్డ్ వార్ షురూ అయిందా ? ఒకే పార్టీలో ఇద్దరు నేతల పాదయాత్రలు దేనిని సూచిస్తున్నాయి ? టి కాంగ్రెస్ లో జరుగుతున్నా తాజా పరిణామాలను గమనిస్తే.. ఈ ప్రశ్నలు రాక మానవు. కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావాలని, వచ్చే ఎన్నికల్లో సత్తా చాటలని హస్తం పార్టీ హైకమాండ్ గట్టిగా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే టి కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాదయాత్ర చేయిస్తోంది హస్తం పార్టీ హైకమాండ్. హత్ సే హత్ జోడో యాత్ర పేరుతో రేవంత్ రెడ్డి ఇప్పటికే పాదయాత్ర చేపట్టి తనదైన రీతిలో ప్రజల్లోకి వెళుతున్నారు.
అయితే రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు పార్టీ సీనియర్ల నుంచి పెద్దగా మద్దతు లభిచడంలేదు. వి. హనుమంతరావు, బట్టి విక్రమార్క లాంటి ఒకరిద్దరు నేతలు కాస్త మద్దతు తెలుపుతున్నప్పటికి, మెగిలిన సీనియర్స్ అందరూ కూడా రేవంత్ పాదయాత్రకు దూరంగానే ఉన్నారు. అయితే పార్టీ అధిష్టానం చొరవ తీసుకొని నేతలంతా కలిసికట్టుగా పార్టీ కోసం పని చేయాలని సూచిస్తున్నప్పటికి సీనియర్స్ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉంచితే ఇదే హస్తం పార్టీకి చెందిన ఏలేటి మహేశ్వరరెడ్డి కూడా పాదయాత్ర చేపట్టారు. తన పాదయాత్ర కూడా హైకమాండ్ అనుమతితోనే జరుగుతోందని, ఇది కూడా హత్ సే హత్ జోడో యాత్రలో భాగమే అని మహేశ్వర రెడ్డి చెబుతున్నారు.
ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే రేవంత్ రెడ్డి పాదయాత్రలో కనిపించని సీనియర్స్.. మహేశ్వరరెడ్డి పాదయాత్రలో ప్రత్యేక్షమయ్యారు. దీంతో మరోసారి రేవంత్ రెడ్డి వర్సస్ సీనియర్స్ ఎపిషోడ్ తెరపైకి వచ్చింది. అయితే అటు రేవంత్ రెడ్డి, ఇటు మహేశ్వరరెడ్డి ఇద్దరు కూడా పార్టీని బలపరిచేందుకే పాదయాత్రలు అని చెబుతున్నప్పటికి. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు వేర్వేరుగా పాదయాత్రలు చేస్తుండడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎవరికివారే ఎమునాతీరే అన్నట్లుగా వ్యవహరించడం హస్తం నేతలకు కొత్తేమీ కాదు. అయితే పార్టీలోని ఈ అంతర్గత విబేధాల వల్ల.. నష్టపోయేది కాంగ్రెసే అనేది కొందరి విశ్లేషకుల వాదన. మరి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగుతుండడంతో .ఎన్నికల నాటికి ఈ అంతర్గత విభేదాలు మరింత పెరిగితే.. ఆ ప్రభావం పార్టీపై గట్టిగానే పడే అవకాశం ఉంది. మరి టి కాంగ్రెస్ నేతల మద్య ఈ ఆదిపత్య విభేదాలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.
ఇవి కూడా చదవండి…