నగరంలోని పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించేందుకు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు, అటవీ శాఖ మంత్రి జోగు రామన్నలు పరిశ్రమల యాజమాన్యాలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కాలుష్య నియంత్రణ మండలి, సనత్ నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మంత్రులు పారిశ్రామికవేత్తలతో కాలుష్య నియంత్రణ, పారిశ్రామిక వ్యర్ధాల నియంత్రణపైన ప్రభుత్వ అలోచనలను వారితో పంచుకున్నారు.
నగరం నుంచి కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రిండు రోడ్డు అవతలకు తరలించాలని 2013లోనే జివో నంబర్ 20 జారీ చేశారని, ఇప్పడు అ జీవోను ఖచ్చితంగా అమలు చేస్తామని కేటీఆర్ తెలిపారు. లేకుంటే ఢిల్లీ నగరంలాగా కాలుష్యం నగరాన్ని కమ్ముకోకుండా కాపాడుకునేందుకే ఈ ప్రయత్నం అన్నారు. ఈ మేరకు ఔటర్ రింగు రోడ్డు అవల 17 ప్రాంతాలను గుర్తించామన్నారు. అయా ప్రాంతాల్లో పరిశ్రమల వారిగా క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
క్లస్టర్ల వారీగా అయా పరిశ్రమలు వేగంగా అభివృద్ది అవుతాయన్నారు. అయితే అయా క్లస్టర్లలో ప్రభుత్వం కల్పించాల్పిన మౌళిక వసతుల కల్పన పూర్తయిన తర్వాతనే, పరిశ్రమలను తరలించే కార్యక్రమం మెదలుపెడతామన్నారు. అయితే ఇది ధశల వారీగా ఉంటుందని, ఈ ప్రక్రియ అచరణాత్మ, ప్రాక్టికల్ దృక్పథంతో ఉంటుందన్నారు. ఈ మేరకు అవసరం అయిన ప్లానింగ్ లో పరిశ్రమలతో కలిసి పనిచేస్తామని, అందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
తరలి వెళ్లాల్సిన వాటిలో వాటిలో 50 శాతంపైగా లైప్ సైన్సెస్, ఫార్మ కంపెనీలే ఉన్నాయని, వీటన్నింటికీ అంతర్జాతీయ సౌకర్యాలతో కూడిన ఫార్మసిటీ కేంద్రంగా ఉంటుందన్నారు. ఈ ఫార్మసీటీలో మెదటి ప్రాధాన్యత హైదరాబాద్ నగరంలోపల ఉన్న ఫార్మ కంపెనీలకే అవకాశం ఇస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు తరలి వెళ్లే వరకైనా జీరో లిక్విడ్ డిచ్చార్జీ అధునాతన ఏర్పాట్లు చేసుకోవాలని, వ్యర్ధాలను అరికట్టాలని, ప్రమాణాలను పెంచుకోవాలని కోరారు. పరిశ్రమలు పెరుగుదలకు సహకరిస్తూనే, చట్టాల అమలులోనూ తాము ఖచ్చితంగానే ఉంటామన్నారు.
పారిశ్రామిక కాలుష్యం తగ్గించాలని ప్రజలనుంచి తీవ్రమైన ఒత్తిడి ఉన్నదని, ప్రజలను కాపాడాల్సిన భాద్యత ప్రభుత్వానికి ఉంటుందని తెలిపారు. అందుకే కాలుష్యాన్ని తగ్గించేదుకు ప్రత్యేకమైన డ్రైవ్ చేపడతామని, ఈ డ్రైవ్ లో చాల పారదర్శకంగా, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా చూస్తామని తెలిపారు.
పరిశ్రమల ప్రతినిధులు మంత్రులకు పలు సలహాలు ఇవ్వడం జరిగింది. మంత్రులే స్వయంగా తమ వద్దకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వర్గాల సలహాల మేరకు పిర్యాదులకు ఒక టోల్ ప్రీ నంబర్ ఏర్పాటు చేయడం, పిసిబి అధికారులు, పరిశ్రమ వర్గాలతో ఒక కామన్ వర్కింగ్ గ్రూప్ ఎర్పాటు చేస్తామని తెలిపారు. పోలీస్, పిసిబి, జియచ్ యంసీ, పారిశ్రమ వర్గాలతోకూడిన ఒక టాస్క్ ఫోర్స్ ను కాలుష్య నియంత్రణకోసం ఏర్పాటు చేస్తామని మంత్రి కెటి రామారావు తెలిపారు.
సమావేశం అనంతరం మాట్లాడిన అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ప్రభుత్వం గట్టిగా చట్టాలను అమలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం యంత్రాంగం తరపున తీసుకోవాల్సిన చర్యలపైన ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంపెనీలు స్వీయ నియంత్రణ పాటించి, కాలుష్యం తగ్గించుకోవాలన్నారు. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం సహకరిస్తుందని, కానీ ప్రమాణాలను ఉల్లంఘించే వారిపైన కఠిన చర్యలు తప్పవన్నారు. ముఖ్యంగా నాలాల్లోకి వ్యర్ధాలను వదిలే వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మంత్రి జోగు రామన్నతెలిపారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకు సిసి టివి నెట్ వర్క్ ఏర్పాటు చేయడం, రాత్రి సమయాల్లోనూ పెట్రోలింగ్ ఎర్పాటు చేస్తామన్నారు. టొక్యో క్లీన్ ఎయిర్ అథారిటీ మాదిరే నగరలోనూ ఇలాంటి అథారిటీ ఎర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. పారిశ్రమల్లో మూడవ వంతు గ్రీన్ బెల్ట్ మెయిన్ టెన్ చేయాలని, ఈ మేరకు వచ్చే హరితహారం కార్యక్రమం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవడాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో సంగారెడ్డి, మెడ్చేల్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్లతోపాటు పోలీసు కమిషనర్లు హాజరయ్యారు.