నేషనల్ రైతు దినోత్సవం సందర్భంగా లక్షన్నర మంది రైతులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని రైతులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ…వివిధ అంశాలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. అన్నదాతల కోసం నిత్యం పనిచేసే తమ ప్రభుత్వానికి ఎప్పటిలానే అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని నమ్మే కేసీఆర్… దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఊహించేందుకు కూడా సాహసించని రైతుబంధు కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. రైతుబంధుతో అన్నదాతకు ఆత్మబంధువుగా నిలుస్తూ ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి సాయం చేస్తుందని కేటీఆర్ తెలిపారు. రైతుబంధుతో ఇప్పటి వరకు 9 విడతల్లో రూ. 57,882 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేశామన్నారు.10వ విడత నిధులు రూ. 7,600 కోట్లు ఈ నెలాఖరు నుండి పంపిణీ చేస్తామన్నారు. రైతుబంధు సుమారు 66 లక్షల మంది తెలంగాణ రైతులకు లబ్ది కలుగుతుందన్నారు.
రైతుల తరుపున ప్రభుత్వమే బీమా ప్రీమియంను చెల్లించి దురదృష్టవశాత్తు చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇస్తూ భరోసాను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్‌దే అని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు సుమారు 94 వేల రైతు కుటుంబాలకు రూ. 4700 కోట్ల బీమా పరిహారం చెల్లించామన్నారు.
తెలంగాణ గ్రామీణ వ్యవస్థకు ఆదరువు చెరువే అన్న సత్యాన్ని గుర్తించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆరే అన్న కేటీఆర్… సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురయిన చెరువులకు స్వరాష్ట్రంలో “మిషన్ కాకతీయ”తో ప్రాణంపోశారని చెప్పారు. మిషన్ కాకతీయతో తెలంగాణలోని 27,625 చెరువులకు పునర్వైభవం వచ్చిందన్నారు. ఫలితంగా లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని చెప్పారు.
సమైక్య రాష్ట్రంలో పెండింగ్‌లో పడ్డ ప్రాజెక్టులన్నింటిని పూర్తిచేసి కాళేశ్వరం లాంటి నూతన ప్రాజెక్టులతో తెలంగాణను ఒక సజీవ సాగునీటి క్షేత్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు కేటీఆర్. తెలంగాణ సాగునీటి రంగ విజయాలతో కేసీఆర్ అంటే కాలువలు చెరువులు రిజర్వాయర్లు అన్న తీరుగా అర్థం మారిందన్నారు. ఒకప్పుడు కరువుకు కేరాఫ్ అడ్రస్ గా వలసలతో వలపోసిన మహబూబ్ నగర్ జిల్లా ఇవాళ పచ్చగా మారి కేసీఆర్ సంకల్ప సిద్ధికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిందన్నారు.
కేసీఆర్ పట్టుదల, చిత్తశుద్దితో సమైక్య రాష్ట్రంలో దండుగలా ఉన్న వ్యవసాయం తెలంగాణలో పండగగా మారిందన్నారు. విద్యుత్, సాగునీటి సౌకర్యాలు మెరుగుపరచడంతో లక్షలాది అదనపు ఎకరాలు సాగులోకి వచ్చి తాగు, సాగునీటికి కొరత లేకుండా కడుపునిండా నీళ్లు దొరుకుతున్నాయన్నారు కేటీఆర్. కేసీఆర్ నాయకత్వంలోని రైతు సర్కార్ కే ఈ ఘనత సాధ్యమైందన్నారు. పండించిన ధాన్యాన్ని కొనమని కేంద్రం మొండికేస్తే… వేలాది కోట్ల రూపాయలతో పండిన ప్రతీ గింజను కొన్న రైతు పక్షపాతి ప్రభుత్వం తమదని కేటీఆర్ తెలిపారు.
వ్యవసాయ సంక్షోభాన్ని తట్టుకోలేక పంట పొలాల్లోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నుంచి ఈరోజు దేశంలోనే అత్యధికంగా ఆహార ధాన్యాలను పండిస్తూ అన్నపూర్ణగా తెలంగాణ మారిందన్నారు కేటీఆర్. తెలంగాణ ఏర్పాటుకు ముందు నాలుగు లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న గోదాముల సామర్థ్యాన్ని 24 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆరు గంటల కరెంటుతో అరిగోస పడ్డ రైతన్నకు సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత, నాణ్యమైన కరెంటును అందిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. 2014కు ముందు కరెంటు కోతలు, దొంగ రాత్రి కరెంటు సరఫరాతో రైతన్నలు బోరు బావుల దగ్గర ప్రాణాలు పోగొట్టుకున్న దుస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటుతో రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తుందన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర వ్యవసాయ ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయిందన్నారు కేటీఆర్. అన్నదాతలను సంఘటితపరిచి, వారిని చైతన్యపరచడానికి ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటుచేసి, ఒక్కో క్లస్టర్‌కు ఒక రైతువేదిక లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా రూ. 572 కోట్లతో 2601 రైతువేదికలను తమ ప్రభుత్వం నిర్మించిందన్నారు. రైతు సంక్షేమం విషయంలో ఇదొక అపూర్వ విజయం అన్నారు.
భవిష్యత్తులోనూ రైతన్నల ఆశీర్వాదం తమకు ఉంటుందన్న ప్రగాఢ విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. రైతే ముఖ్యమంత్రిగా ఉన్న తమ ప్రభుత్వానికి అన్నదాతలు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రైతన్నల మద్దతుతో భవిష్యత్తులోనూ వ్యవసాయ రంగాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా కేటీఆర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి…
ఉభయ సభలు నిరవధిక వాయిదా…
కైకాల భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి
టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్పు.. పార్లమెంట్లో స్పందన