జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆయన పార్టీ వ్యవహారాలలో చురుకుగా పాల్గొంటున్నారు. గతంలో పవన్ పై పార్ట్ టైమ్ పొలిటీషియన్ అనే ముద్ర గట్టిగా ఉండేది. దాంతో స్థిరత్వం లేని పార్టీగా జనసేన ప్రజల్లో ముద్ర వేసుకుంది. ప్రజల్లో ఏర్పడిన ఈ భావమే గత ఎన్నికల్లో జనసేన పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది. కాగా గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. దీంతో జనసేన ఏపీలో వేగంగా విస్తరిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు పవన్ దృష్టి తెలంగాణపై పడిందా అంటే అవుననే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. .
ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కు అభిమానుల సంఖ్య గట్టిగానే ఉంది. అందువల్ల తన రాజకీయ ప్రస్థానాన్ని ఏపీ వరకే పరిమితం చేయకుండా తెలంగాణలో కూడా విస్తరింపజేయాలని పవన్ భావిస్తున్నారట. ఇక తెలంగాణలో ఎన్నికలకు కరెక్ట్ గా ఏడాది సమయం ఉండడంతో ఇప్పటి నుంచే పవన్ తెలంగాణలో జనసేన పార్టీని బలపరిచేందుకు సిద్దమౌతున్నారని పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఈ మేరకు పవన్ ఆదేశాలతో తెలంగాణలో కార్యవర్గ విస్తరణ దిశగా ఇప్పటికే 32 నియోజిక వర్గాలలో కార్యనిర్వాహకులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
విరిచ్చే నివేదిక ఆధారంగా మరికొన్ని నియోజిక వర్గాలపై కూడ ఫోకస్ చేయనున్నారని సమాచారం. దీన్ని బట్టి చూస్తే పవన్ తెలంగాణపై కూడా గట్టిగానే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కు తెలంగాణలో ఎంతవరకు మద్దతు లభిస్తుందనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే తెలంగాణలో బలమైన ప్రభుత్వ పార్టీగా టిఆర్‌ఎస్, అలాగే విపక్ష పార్టీలుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలం చాటుకుంటున్నాయి. ఇక వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో వైఎస్ షర్మిల కూడా బలం చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంత ఫుల్ కాంపిటేషన్ లో పవన్ తెలంగాణ ప్రజలను ఎంతవరకు ఆకర్షిస్తారనేది చూడాలి.
ఇవి కూడా చదవండి..