గుజరాత్ అసెంబ్లీ మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. మొత్తం 2.39 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనుండగా 14,382 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. తొలి విడుతలో భాగంగా 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాల్లో 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
బీజేపీ, కాంగ్రెస్, ఆప్ అభ్యర్థులు, పార్టీల అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. 1995 నుంచి గుజరాత్ లో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు పట్టుదలతో ఉంది. కానీ, 2002 నుంచి ఆ పార్టీకి అసెంబ్లీ స్థానాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2018 ఎన్నికల్లో 137 అసెంబ్లీ స్థానాల నుంచి 99 స్థానాలకు బీజేపీ పడిపోయింది. ఈ దఫా ఎన్నికల్లో రాష్ట్రంలో 182 అసెంబ్లీ సీట్లలో 140 సీట్లను లక్ష్యంగా చేసుకొని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు.
అయితే ఈ సారి కాంగ్రెస్, ఆప్ నుండి గట్టిపోటీ ఎదురైంది. బీజేపీ, కాంగ్రెస్ మొత్తం సీట్లలో అభ్యర్థులను నిలపగా, ఆప్ 88 స్థానాల్లో, బీఎస్పీ 57 మందిని నిలబెట్టింది. వీరితోపాటు 339 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..