క్రేజీ బ్యూటీ త్రిష లేటెస్ట్ మూవీ ‘గర్జనై’. సుందర్ బాలు డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకి జల్లికట్టు ఉద్యమకారుల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి.
జల్లికట్టు నిషేధానికి కారణమైన ‘పెటా’ సంస్థలో త్రిష ప్రచారకర్తగా ఉన్నారంటూ ‘గర్జనై’ చిత్రీకరణ జరిగే ప్రాంతాల్లో జల్లికట్టు ఉద్యమకారులు ఆందోళనలు చేసి ఈ సినిమా షూటింగ్‌ను అడ్డుకున్నారు.ప్రస్తుతం జల్లికట్టు వ్యవహారం సమసిపోవడంతో ఇప్పుడు ఎలాంటి బ్రేక్ లు లేకుండా షూటింగ్‌ని కొనసాగిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. అయితే దర్శకుడు సుందర్ బాలు ‘గర్జనై’ గురించి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు సంబంధించిన కథగా తెలిపారు. అయిదుగురు యువకులు ఒక బృందంగా ఏర్పడి యువతులను లైంగిక వేధింపులకు గురి చేస్తారని, ఆ దృశ్యాలను వీడియో కెమెరాల్లో బంధించి సామాజిక మాధ్యమాల్లో విక్రయిస్తుంటారని పేర్కొన్నారు. ప్రేమించడానికి నిరాకరించే యువతిని సామూహిక అత్యాచారం చేసి హత్య చేస్తారని తెలిపారు.
ఇదే నేపథ్యంతో సాగే యాక్షన్ థ్రిల్లర్ చిత్రమే ‘గర్జనై’గా పేర్కొన్నారు చిత్ర దర్శకుడు. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో భిన్నమైన కోణంలో త్రిష నటించారని, యాక్షన్ సన్నివేశాలతో నిండిన ఈ చిత్రంలో ఏమాత్రం బెదరకుండా, డూప్ లేకుండా నటించారని తెలిపారు.
కథ విన్న వెంటనే నటించడానికి త్రిష ఒప్పేసుకుందని తెలిపారు. ఈ సినిమాకి అమ్రిష్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక సినిమాని సెంచురి ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ సంస్థ పతాకంపై జేమ్స్ నిర్మిస్తున్నారు.