ప్రొటోకాల్ కు భిన్నంగా ప్రధాని మోదీ దౌత్య సంప్రదాయాల్ని పక్కన పెట్టి శుక్రవారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాకు స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్లో పర్యటిస్తున్న హసీనా ప్రధాని మోదీతో విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు ప్రధానులు కలసి సంయుక్త మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది.
ఇద్దరు ప్రధానులు ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించిన సందర్భంగా.. వారిద్దరినీ పదవి నుంచి దిగిపోవాలంటూ కార్యక్రమ వ్యాఖ్యాత అనడంతో భారత ప్రధాని నరేంద్రమోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఒక నిమిషం పాటు నవ్వుతూ ఉండిపోయారు.
ఇంతకీ ఆ నవ్వుకు కారణం ఏమంటే.. ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా పత్రాలపై ఇరు దేశాల ప్రధానులు సంతకాలు చేయాల్సి ఉంది. వ్యాఖ్యాత ఇద్దరు ప్రధానులనూ వేదికపైకి ఆహ్వానిస్తూ సభకు పరిచయం చేశారు. ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన అనంతరం వారిద్దరూ వేదిక దిగువన ఉన్న మీడియా పాయింట్ వద్దకు వచ్చి మాట్లాడాల్సి ఉంది. దీనిపై వ్యాఖ్యాత మాట్లాడుతూ.. వేదిక దిగి విలేకరుల వద్దకు వెళ్లాల్సిందిగా(స్టెప్ అవే) కోరుతున్నా అని అనడానికి బదులు.. ‘ఇద్దరు ప్రధానులూ దిగిపోవాల్సిందిగా(స్టెప్ డౌన్) అభ్యర్థిస్తున్నాను’ అని పలికాడు. దీంతో వెంటనే మోదీ నవ్వారు. దీనికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా జతకలిసి కొద్దిసేపు అలాగే నవ్వుతూ ఉండిపోయారు. భారత ప్రధాని మోదీ, బాంగ్లాదేశ్ ప్రధాని హసీనాల సమక్షంలో కీలకమైన 22 ఒప్పందాలు జరిగాయి. వీటిలో అణు ఇంధనం, రక్షణతో పాటు పలు ఒప్పందాలు ఉన్నాయి.