కేంద్ర విధానాలు తెలంగాణకు భారీనష్టం
ఆదుకోవాల్సిన కేంద్రమే అడ్డుకుంటోంది
14 రాష్ట్రాలకు రెవెన్యూలోటును భర్తీ చేసిన కేంద్రం
రూ.7,183 కోట్లు విడుదల చేసిన కేంద్రం
రెవెన్యూలోటు భర్తీ బాధ్యత కేంద్రానిదే..?
ఆర్టికల్ 275 తెలంగాణకు వర్తించదా..?
తెలంగాణను రెవెన్యూలోటులోకి నెట్టిన కేంద్రం
కాగ్ నివేదికనైనా పరిగణలోకి తీసుకోండి
కేంద్రాన్ని కోరుతున్న రాష్ట్ర సర్కార్
తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అంతులేని విధంగా భంగం కలిగిస్తూ మాయ మాటలు, శుష్కవాగ్దానాలతో రాష్ట్రంలో పాగా వేసేందుకు దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) అసలు రంగు బయటపడిందనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న బిజెపి ఆచరణలో మాత్రం తెలంగాణ రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయలను ఆర్ధికంగా నష్టపరుస్తూ అభివృద్ధి-సంక్షేమ పథకాలకు బ్రేకులు వేస్తోంది. బిజెపి నేతలకు అధికారం కావాలిగానీ తెలంగాణ ప్రజల సంక్షేమం, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించడం ఇష్టం లేదని మరోసారి స్పష్టమయ్యిందని విశ్లేషకులు, ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు. దేశంలోని 14 రాష్ట్రాలకున్న రెవెన్యూ లోటును భర్తీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయిని కూడా ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది.
రెవెన్యూలోటుగా ఉన్న ఈ 14 రాష్ట్రాలకు రెవెన్యూలోటులో ఉండటానికి కేంద్ర ప్రభుత్వం కారణం కాదని, స్వయంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల్లో ఉన్న పరిస్థితులే కారణమని, కానీ తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ లోటు సమస్య తలెత్తడానికి మాత్రం ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆర్థికశాఖలోని పలువురు సీనియర్ ఆధికారులు అంటున్నారు. అందుచేతనే తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ లోటును కూడా కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేయడం న్యాయమని ఆ అధికారులు బల్లగుద్ది వాదిస్తున్నారు. కానీ కేంద్రం ప్రభుత్వం రెవెన్యూ లోటు సమస్యతో బాధపడుతున్న 14 రాష్ట్రాలకు సోమవారం 7,183 కోట్ల 42 లక్షల రూపాయల నిధులను విడుదల చేసిందని, ఆ జాబితాలో తెలంగాణ రాష్ట్రం లేకపోవడం బాధాకరమని అంటున్నారు. నవంబర్ నెలకు సంబంధించిన రెవెన్యూ లోటు నిధులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 879కోట్ల 8 లక్షల రూపాయలను కేంద్రం విడుదల చేసింది.
అస్సాంకు 407.50 కోట్లు, కేరళ 1097.83 కోట్లు, మణిపూరకు 192.50, మేఘాలయ రాష్ట్రానికి 86.08 కోట్లు, మిజోరాంకు 134.58 కోట్లు, నాగాలాండ్ కు 377.50 కోట్లు, పంజాబ్ రాష్ట్రానికి 689.50 కోట్లు, రాజస్థాన్ కు 405.17 కోట్లు, సిక్కింకు 36.67 కోట్లు, త్రిపుర రాష్ట్రానికి 368.58 కోట్లు, ఉత్తరాఖాండ్ రాష్ట్రానికి 594.75 కోట్లు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 1, 132.25 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. పైగా ఈ నిధులను 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకే విడుదల చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వశాఖ సగర్వంగా ప్రకటించింది. 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు 2020 – 21వ ఆర్ధిక సంవత్సరం నుంచి 2025-26వ ఆర్ధిక సంవత్సరం వరకూ ఈ 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటును భర్తీ చేయాలని ఉంది. అందులో భాగంగానే ఈ 14 రాష్ట్రాలకు 2022-23వ ఆర్ధిక సంవత్సరానికి ఇప్పటి వరకూ 57,467 కోట్ల 33 లక్షల రూపాయల నిధులను విడుదల చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం రాష్ట్రాలకు రెవెన్యూ లోటు సమస్య తలెత్తితే కేంద్రమే ఆర్ధికంగా ఆదుకోవాల్సి ఉందని, అయితే ఈ చట్టం తెలంగాణ రాష్ట్రానికి వర్తించదా…? అని ఆ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం, 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకే రెవెన్యూలోటును భర్తీ చేస్తున్నట్లుగా పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయానికొచ్చే సరికి అదే 15వ ఆర్థిక సంఘం సిఫారసులను పట్టించుకోలేదని, కనీసం 14వ ఆర్థిక సంఘం సిఫారసులను గానీ, నీతి ఆయోగ్ సిఫారసులను కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆర్ధిక సంఘాల సిఫారసులను కేంద్రం తూచ తప్పకుండా అమలుచేస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ పథకాలు, ఇతర పథకాలకు కలిపి మొత్తం 34,149 కోట్ల రూపాయల నిధులు రావాల్సి ఉందని, కానీ కేంద్రం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందనడానికి ఈ అంశాలే నిలువెత్తు నిదర్శనాలని అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆ 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటును భర్తీ చేయడాన్ని తాము తప్పబట్టడం లేదని, తమకెలాంటి అభ్యంతరం కూడా లేదని, అయితే కేంద్ర ప్రభుత్వ నిర్వాకాల మూలంగా, కేంద్రం తీసుకొన్న తప్పడు నిర్ణయాల మూలంగా రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పడు రెవెన్యూ లోటు సమస్యను ఎదుర్కొంటోందని, ఇలాంటి పరిస్థితుల్లో రెస్క్యూలోనికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ పనిచేయకపోవడమే చర్చనీయాంశమయ్యిందని ఆ అధికారులు అంటున్నారు.
బడ్జెట్ అంచనాలు తారుమారయ్యి రెవెన్యూ మిగులు నుంచి లోటులోకి పడిపోతే అది రాష్ట్ర ప్రభుత్వ పొరపాటు అవుతుందని, కానీ కేంద్రం తీసుకొన్న నిర్ణయాల మూలంగా రెవెన్యూలోటు ఏర్పడితే మాత్రం కేంద్రమే ఆ లోటును భర్తీ చేయాల్సి ఉంటుందని, ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 11,072 కోట్ల 76 లక్షల రూపాయల నిధులను విడుదలచేసి ఆదుకోవాల్సి ఉందని ఆ అధికారులు అంటున్నారు. ఎందుకంటే రుణాల సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు 2022-23వ ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత రెండు నెలలు ఆలస్యంగా విడుదల చేశారని, దీని మూలంగా నెలవారీగా సేకరించే నిధుల్లో ఇప్పటికే 10, 200 కోట్ల రూపాయలను నష్టపోయిన తెలంగాణ ప్రభుత్వానికి అదనంగా రెవెన్యూ లోటు సమస్య కూడా తలెత్తిందని, ఇవనీ కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల మూలంగానే జరిగిందని ఆ అధికారులు గట్టిగా వాదిస్తున్నారు. అందుకే బిజెపి చరిత్రలో తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతుందని ధ్వజమెత్తారు. ఇకనైనా బిజెపి నేతలు తమ పద్దతులను మార్చుకొని తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..