కేంద్రంలో పేరుకుపోయిన బకాయిలు

53
- Advertisement -

జాడలేని కేంద్రం గ్రాంట్ల నిధులు ఇవ్వాల్సిన నిధులివ్వరు, అప్పులు తెచ్చుకోనివ్వరు ఇలాగైతే తెలంగాణలో అభివృద్ధి ఎలా సాధ్యం ?
సంక్షేమ పథకాలకు కేంద్రం మోకాలడ్డు
నీతి ఆయోగ్ సిఫారసులు బుట్టదాఖలు అమలుకాని 14వ, 15వ ఆర్ధిక సంఘాల సిఫారసులు

తెలంగాణను ఆర్ధికంగా దెబ్బకొట్టిన కేంద్రం

తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలను ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగానే వేధింపులకు గురిచేస్తోందనే విమర్శలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఆర్ధికంగా తెలంగాణ రాష్ట్రాన్ని దెబ్బకొట్టాలనే ఉద్దేశ్యంతోనే కేంద్రం ప్రభుత్వం పక్కా ప్రణాళికతోనే నిధులను ఇవ్వకుండా సతాయిస్తోందనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి.

రాష్ట్రానికి గ్రాంట్ల రూపంలో ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోతే ఎఫ్.ఆర్.బి.ఎం.చటానికి లోబడి రుణాలను సేకరించుకొంటాం… అనుమతులు ఇవ్వడి.. అని అడిగితే కూడా కేంద్రం అనుమతులు ఇవ్వకుండా కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందనే విమర్శలు జాతీయస్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గాంట్ల రూపంలో రావాల్సిన నిధులు ఏకంగా 34,149 కోట్ల 71 లక్షల రూపాయల వరకూ బకాయిలుగా ఉన్నాయి. కానీ ఒక్క రూపాయిని కూడా కేంద్రం గ్రాంట్ల నిధులను విడుదల చేయకుండా గడచిన నాలుగేళ్ళుగా తెలంగాణ రాష్ట్రాన్ని వేధిస్తూనే ఉందనే విమర్శలున్నాయి. రాష్ట్రాలు అప్పల రూపంలో నిధులను సమీకరించుకునేందుకు వీలుకల్పించే నియమ, నిబంధనల్లో కూడా సమూల మార్పులు చేసింది కూడా తెలంగాణ రాష్ట్రాని వేధించడానికేననే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి.

తెలంగాణను లక్ష్యంగా చేసుకొని దేశంలోని ఇతర రాష్ట్రాలను కూడా కేంద్రం వేధిస్తోందని పలువురు సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజ్యాంగానికి లోబడి, ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా, కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్, కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ నియమ, నిబంధనల మేరకు తెలంగాణ రాష్ట్రానికి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధులను కూడా నిలిపివేసి తెలంగాణ ప్రజలకు కేంద్రంలోని బి.జే.పి. ప్రభుత్వం ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటుందో అర్ధంకావడంలేదని వారు మండిపడుతున్నారు. 2020వ సంత్సరంలో చేసిన అప్పలకు కూడా గత నెలలో తీసుకొచ్చిన రూల్సును వర్తింపజేశారని, అంటే పాత అప్పలకు కొత్త రూల్సును అమలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్ధికంగా కోలుకోలేని విధంగా దెబ్బకొట్టడంలో కేంద్ర ప్రభుత్వం సఫలీకృతం అయ్యిందని విమర్శిస్తున్నారు. దీంతో కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి, ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు కార్పోరేషన్ల ద్వారా నిధులను సమీకరించుకునే వెసులుబాటును కూడా కేంద్రం తొలగించడంతో ఈ ఏడాది ఏకంగా 20వేల కోట్ల రూపాయల రుణాలను కోల్పోయామని వివరించారు. దాంతో ఈ ఏడాది బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించిన 54 వేల కోట్ల రూపాయల నిధులను కూడా ఖర్చు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని కొందరు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అన్ని మార్గాల్లో నుంచి సొంత ఆదాయం నెలకు సుమారు 12 వేల కోట్ల రూపాయల వరకూ ఉంటాయని, కానీ నెలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులన్నీ కలుపుకొంటే 16 వేల కోట్ల రూపాయల వరకూ ఉంటాయని వివరించారు. అంటే లోటు నెలకు నాలుగు వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని, అందుచేత నెలకు కనీసం నాలుగు వేల కోట్ల రూపాయలను అప్పల రూపంలో నిధులను సమీకరించుకోవాల్సి ఉంటుందని వివరించారు.

ఈ పరిస్థితులన్నీ క్షుణ్ణంగా కేంద్రానికి తెలుసునని, కానీ అప్పలు తీసుకొచ్చుకోకుండా కొత్తగా ఏవో రూల్సు పెట్టామని, ఆ రూల్సు ప్రకారం అప్పులు చేయడానికి వీల్లేదని కేంద్రం అడ్డుపుల్ల వేసిందని, తెలంగాణ రాష్ట్రానికి గ్రాంట్ల రూపంలో ఇవ్వాల్సిన 34, 149 కోట్ల రూపాయల నిధులనైనా విడుదల చేస్తారా.. అంటే అదీ లేదని, ఇలాగైతే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరిగేది ఎలా?.. సంక్షేమ పథకాలను ముందుకెలా తీసుకెళ్ళాలి?.. ప్రభుత్వ పాలనను ఎలా సాగించాలి?.. అని ఆ సీనియర్ అధికారులు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వమా.. తెలంగాణను వేధించింది చాలు.. ఇకనైనా తెలంగాణ ప్రజలపైన కనికరం చూపించి తమ రాష్ట్రానికి గ్రాంట్ల రూపంలో ఇవ్వాల్సిన నిధులను విడుదల చేసి ఆదుకోవాలని అధికారులు కోరుతున్నారు. 14వ ఫైనాన్స్ కమీషన్ సిఫారసుల ప్రకారం తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు 315 కోట్ల 32 లక్షల రూపాయలు, పట్టణ స్థానిక సంస్థలకు 502 కోట్ల 61 లక్షల రూపాయలు కలిపి స్థానిక సంస్థలకు 817 కోట్ల 61 లక్షల రూపాయల నిధులను గ్రాంట్ రూపంలో కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంవత్సరానికి 450 కోట్ల రూపాయల లెక్కన గడచిన మూడేళ్ళకు కలిపి 1,350 కోట్ల రూపాయల నిధులను కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి గ్రాంట్ ఇవ్వాల్సి ఉంది. 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు పన్నులవాటాలో తెలంగాణకు ఇవ్వాల్సిన 723 కోట్ల రూపాయలను ఇప్పటి వరకూ ఇవ్వలేదు. 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల ప్రకారం న్యూట్రిషన్ రంగంలో తెలంగాణకు మరో 171 కోట్ల రూపాయల నిధులను ఇవ్వాల్సి ఉంది.

కొన్ని ప్రత్యేకమైన రంగాలకు 15వ ఆర్థిక సంఘం 3,024 కోట్ల రూపాయల నిధులను గ్రాంటుగా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని సిఫారసు చేసింది. ఆ నిధులను కూడా ఇవ్వలేదు. మిషన్ భగీరథ పథకానికి 15వ ఆర్ధిక సంఘం తెలంగాణ రాష్ట్రానికి మరో 2350 కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసింది. ఇప్పటికీ అతీగతీ లేదు. ఇదిలావుండగా నీతి ఆయోగ్ సంస్థ కూడా మిషన్ భగీరథ పథకానికి 19, 205 కోట్ల రూపాయలను గ్రాంటుగా తెలంగాణకు ఇవ్వాలని సిఫారసు చేసిందని, అంతేగాక మిషన్ కాకతీయ పథకానికి మరో అయిదు వేల కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలని కూడా సిఫారసు చేసినప్పటికీ కేంద్రం ఒక్క రూపాయిని కూడా గ్రాంట్ గా ఇవ్వకపోగా అనేక ఇబ్బందులు సృష్టిస్తోందని ఆ అధికారులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 495 కోట్ల 20 లక్షల రూపాయల నిధులను కేంద్రం చేసిన పొరపాటుతో ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళాయని, ఆ నిధులను కూడా కేంద్రం తెలంగాణకు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని అంటున్నారు. 2021-22వ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు 682 కోట్ల 50 లక్షల రూపాయలు, పట్టణ స్థానిక సంస్థలకు 331 కోట్ల 40 లక్షల రూపాయల నిధులను గ్రాంటుగా ఇవ్వాల్సిన కేంద్రం ఆ ఊసెత్తడంలేదని తెలిపారు. ఇలా మొత్తం కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి గ్రాంట్ల రూపంలో రావాల్సిన 34,149 కోట్ల 71 లక్షల రూపాయల నిధులు ఇవ్వడం లేదని, ఈ చర్యలు మూలంగా కేంద్రం ఎంత దారుణంగా తెలంగాణ ప్రజలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందో అర్ధంచేసుకోవాలని ఆ అధికారులు కోరుతున్నారు.

- Advertisement -