భారత ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ 2023 జనవరి 8న గడువు ముగుస్తుండటంతో ఈసీ ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టింది. కానీ గుజరాత్ రాష్ట్ర ఎన్నికలను కూడా ప్రకటన చేస్తుందని అంతా భావించారు. అయితే ఈసీ మాత్రం గుజరాత్ షెడ్యూల్ ప్రకటించలేదు. గుజరాత్ అసెంబ్లీ గడువు 2023 ఫిబ్రవరి18న ముగుస్తుండటంతో ఎన్నికల షెడ్యూల్‌ను ఈ యేడాది డిసెంబర్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం కేవలం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తేదీని మాత్రమే ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్12న ఒకే విడుతలో పోలింగ్ జరుగనుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. డిసెంబరు 8న కౌంటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన అక్టోబర్ 17న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అక్టోబర్ 25 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇవ్వనున్నారు. అక్టోబర్ 27వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబర్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో అక్కడ బీజేపీ నుంచి 45 మంది, కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇతరులు ముగ్గురు ఉన్నారు. అయితే 1985 నుంచి ఇప్పటివరకు హిమాచల్‌ప్రదేశ్‌లో ఏ ఒక్క పార్టీ కూడా వరుసగా రెండు సార్లు గెలువలేదు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటన చేస్తుందని అంతా భావించారు. అయితే ఈసీ మాత్రం గుజరాత్ షెడ్యూల్ ప్రకటించలేదు. కానీ గుజరాత్ లో 182 అసెంబ్లీ స్థానాలుండగా గత ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 99 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందడంతో ఎన్డీఏ బలం 111కు చేరింది.