టీడీపీతో కలిసి బీజేపీ కుమ్మక్కై తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కాంగ్రెస్ టీడీపీ నీచ రాజకీయాలు మరోకసారి తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక కాంట్రాక్టు కోసం వచ్చిందే తప్ప నియోజకవర్గ బాగు కోసం కాదని మండిపడ్డారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ… మునుగోడు ప్రజలంతా ఒక్కటై ద్రోహులకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడ అమలు కానీ పథకాలను కాపీ కొడుతూ..ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని వంకర బుద్ది కలిగిన బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బీజేపీ గెలిస్తే బాయిలకాడ మోటర్లకు మీటర్లు వస్తాయని…అలా రాకుండా మనమే జాగ్రత్త పడాలని సూచించారు.
మునుగోడులోని మర్రిగూడెం మండలానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గులాబీ పార్టీలో చేరిన వారిలో బీజేవైఎం మండల అధ్యక్షుడు సిలివేరు రఘు, బీజేపీ మండల ఉపాధ్యక్షులు పోలె సైదులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొనుగోటి భాస్కర్ రావు, మండల కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ సహా 30 మంది కార్యకర్తలు ఉన్నారు. టీఆర్ఎస్ గెలుపు కోసం పని చేస్తామని వెల్లడించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గానికి చేసింది శూన్యమని, తమ ప్రాంత అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నామని తెలిపారు.