విద్వేష ప్రసంగాలపై కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం

83
supreme
- Advertisement -

దేశంలో టీవీ ఛానళ్ల పనితీరుపై భారత అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ప్రధాన మాధ్యమంగా ఉన్న ఇవి తరచూ విద్వేష ప్రసంగాలకు వేదికగా మారుతున్నప్పటికీ ఎలాంటి శిక్షలను ఎదుర్కోకుండానే తప్పించుకుంటున్నాయని ఆక్షేపించింది. వీటిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నంచింది.

టీవీ ఛానళ్లలో విద్వేష ప్రసంగాలను అరికట్టడంలో యాంకర్‌ పాత్ర అత్యంత కీలకమని సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. మన దేశం ఎటువైపు వెళ్తోంది. మీడియా సోషల్‌మీడియాలో చాలా విద్వేషపూరిత ప్రసంగాలు వస్తున్నాయి. వీటిపై ఎలాంటి నియంత్రణ లేకుండా పోతోంది. టీవీ ఛానళ్లలో విద్వేష ప్రసంగాలను అరికట్టడంలో టీవీ యాంకర్లకు పెద్ద బాధ్యత ఉంటుంది. చర్చల్లో టీవీ యాంకర్లు అతిథికి కూడా సమయం ఇవ్వరు. మీడియా స్వేచ్ఛ ముఖ్యమైనదే కానీ దానికి ఓ లక్ష్మణ రేఖ ఉంటుందని గుర్తుంచుకోవాలి అతిథులు ఆ గీతను దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాంకర్లదే అని తెలిపింది. విద్వేషాన్ని సమాజంలోకి వదిలేయకూడదు అని కోర్టు వ్యాఖ్యానించింది.

విద్వేష ప్రసంగాలపై కేంద్రం మౌనంగా ఉండటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇదేమైనా చిన్న విషయమా అని ప్రశ్నించింది. ఈ అంశంలో కేంద్రం ప్రతివాదిలా వ్యవహరించకుండా కోర్టుకు సాయం చేయాలని సూచించింది. కేసు తదుపరి విచారణను నవంబర్ 23కు వాయిదా వేసింది. ఆ లోపు విద్వేష ప్రసంగాల నియంత్రణపై లా కమిషన్ ఇచ్చిన సూచనలపై తన వైఖరేంటో చెప్పాలని న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది.

- Advertisement -