కుల, మతాల పేరుతో కొన్ని పార్టీల నేతలు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలోని జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…చిల్లర మాటలతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, అలాంటి వాళ్ల మాటలు పట్టించుకుంటే రాష్ట్రం దశాబ్దాల వెనుకబాటుకు గురవుతుందని చెప్పారు.
గత 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా కేంద్రం స్పందించడం లేదన్న కేటీఆర్… రాష్ట్రానికి కొత్తగా ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ స్కూల్ ఇవ్వలేదని చెప్పారు.
సెప్టెంబర్ 17న భారత్ లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజును గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తోందని చెప్పారు. తెలంగాణకు పోరాటాలు కొత్త కాదన్న మంత్రి… 1948లో నిజాం ప్రభువుపై పోరాటం మొదలు 2014లో రాష్ట్రం సాధించుకునే వరకు అనేక పోరాటాల్లో ప్రజలు పాల్గొన్నారని తెలిపారు.