ఆదివాసీ బంజారా భవనాలను 17న ప్రారంభించనున్న సీఎం: సీఎస్‌

67
cs
- Advertisement -

తెలంగాణలోని ఆదివాసీ, బంజారా భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 17వ తేదీన ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నంబ‌ర్ 10లో నూత‌నంగా నిర్మించిన ఆదివాసీ, బంజారా భ‌వ‌నాల‌ను తెలంగాణ సమైక్యత దినోత్సవం సందర్భంగా ప్రారంభిస్తారని అన్నారు. ఈ నెల 16, 17, 18వ తేదీల్లో నిర్వ‌హించాల్సిన తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌ ఏర్పాట్ల‌పై ఉన్న‌త‌స్థాయి అధికారుల‌తో సీఎస్ స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు హైద‌రాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో విస్తృత ఏర్పాట్లు చేయాల‌ని సంబంధిత శాఖల అధికారుల‌ను ఆదేశించారు. 17వ తేదీన హైద‌రాబాద్‌లోని ప‌బ్లిక్ గార్డెన్‌లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్క‌రిస్తార‌ని పేర్కొన్నారు. అదే రోజు ఆదివాసీ, బంజారా భ‌వ‌నాల‌ను ప్రారంభిస్తార‌ని తెలిపారు.

 నెక్లెస్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ స్టేడియం వ‌ర‌కు గుస్సాడీ, గోండ్, లంబాడీ త‌దిత‌ర క‌ళారూపాల క‌ళాకారుల‌తో భారీ ర్యాలీ నిర్వ‌హించాల‌ని చెప్పారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్ర‌సంగించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 16వ తేదీన రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో విద్యార్థులు, యువ‌త‌, మ‌హిళ‌ల‌చే ర్యాలీలు నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. ఇదే విధ‌మైన కార్య‌క్ర‌మాల‌ను 18వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వ‌హించాల‌ని సూచించారు.

ఈ స‌మావేశంలో జీఏడీ కార్యదర్శి శేషాద్రి, పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జోంగ్డు, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, హ్యాండ్లూమ్ టెక్స్ టైల్స్ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధా ప్రకాష్, పంచాయితీ రాజ్ కమీషనర్ హనుమంత రావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరి కృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -