గాడ్‌ఫాదర్ చిరంజీవి గొప్ప మనసు చాటుకున్నారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో పేద సినీ కార్మికుల కోసం 10 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. కొణిదెల వెంకట్రావు పేరుతో నిర్మించే ఈ ఆసుపత్రిని వచ్చే పుట్టిన రోజు నాటికి అందుబాటులోకి తీసుకొస్తానని వెల్లడించారు. ఆసుపత్రి నిర్మాణానికి అయ్యే ఖర్చును భరించే శక్తి తనకు ఉందన్నారు.
చిత్రపురి కాలనీలో ఉండే సినీ కార్మికులందరికీ, బీపీఎల్ లోపు ఉన్న వారికి, రోజు కూలీ చేసే కార్మికులకు.. వీళ్లందరికీ ఉపయోగపడేలా ఆసుపత్రి ఉంటుందని తెలిపారు. చాలా కార్పొరేట్ ఆసుపత్రుల పెద్దలంతా తనకు స్నేహితులే అని వాళ్లందరి సహకారంతో కచ్చితంగా చేయగలనని తెలిపారు.
సినిమా సక్సెస్ అయినప్పటి కంటే ఆపదలో ఉన్న వారికి ఆదుకున్నపుడు కలిగే సంతృప్తి చాలా గొప్పది. ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోతాం. ఉద్యమంలా బ్లడ్ బ్యాంక్ స్థాపించడానికి కారణమిదే. ఉన్నత విద్యలు అభ్యసించకపోయినా ఈరోజు మేము లక్షల్లో సంపాదిస్తున్నామంటే కారణం సినీ పరిశ్రమ అన్నారు.