బానో దోషుల విడుదలపై సీజేఐ జోక్యం చేసుకోవాలి :కవిత

86
kavitha
- Advertisement -


2002నాటి బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. 2002 నాటి బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషులను విడుదల చేసిన విషయంలో బాధాతప్త హృదయంతో మీకు ఈ లేఖ రాస్తున్నాను.

సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రూపొందించిన 1992 విధానం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సవరించిన విధానం ప్రకారం వారిని రెమిషన్‌కి అనర్హులుగా ప్రకటించవచ్చు. రేప్ వంటి నేరాలు మన సామాజిక స్పృహను కుదిపేస్తాయి. శిక్ష పడిన రేపిస్టులు స్వతంత్ర దినోత్సవం నాడు బయటికి రావడంతో ప్రతీ పౌరుడుకు వెన్నులో వణుకు పుడుతోంది అని పేర్కొన్నారు.

ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసిందని, సీబీఐ ప్రత్యేక కోర్టు వారికి శిక్ష విధించిందని గుర్తు చేశారు. సీబీఐ దర్యాప్తు చేసిన కేసుల్లో దోషుల శిక్షను తగ్గించడం లేదా విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అలాంటి కేసుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సీఆర్పీసీ సెక్షన్ 435(1)(ఏ) చెబుతుందని ప్రస్తావించారు. ఈ కేసులో 11 మంది దోషుల విడుదలకు కేంద్ర ప్రభుత్వంతో గుజరాత్ ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందో లేదో స్పష్టత లేదని తెలిపారు.

క్రిమినల్ అప్పీల్ నెంబరు 490-491/2011 కేసులో 2012 నవంబరు 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 1992 నాటి విధానం స్థానంలో 2014లో సవరించిన రెమిషన్ విధానం వచ్చింది. ప్రభుత్వాలు రెమిషన్ అధికారాలను ఏకపక్షంగా ఉపయోగించవద్దని, స్వాభావిక ప్రక్రియ, వాస్తవిక దృష్టితో రెమిషన్ అధికారాలను ఉపయోగించాలని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసిందని పేర్కొన్నారు. 11 మంది దోషులను విడుదల చేస్తూ తీసుకున్న నిర్ణయంలో తగిన ప్రక్రియ, వాస్తవిక దృష్టిని పరిగణలోకి తీసుకున్నారో లేదో స్పష్టత లేదని తెలిపారు.

ఈ క్రూరమైన నేరం జరిగినప్పుడు బిల్కీస్ బానో వయస్సు 21 సంవత్సరాలు కాగా ఆమె ఐదు నెలల గర్భిణీ. రేపిస్టులు బయటకు రావడాన్ని , ఈ పూలదండలు వేసి స్వాగతం చెప్పడాన్ని చూసి బానో మనసు ముక్కలయ్యి ఉంటుంది. కాబట్టి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని దోషుల విడుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టి చట్టాలపై విశ్వాసాన్ని, మానవత్వాన్ని కాపాడాలని సుప్రీంకోర్టుకు అభ్యర్థిస్తున్నాను అని కవిత విజ్ఞప్తి చేశారు.

- Advertisement -