రేపిస్టుల విడుదలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి: కవిత

79
kavitha
- Advertisement -

2002 నాటి గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానో అనే మహిళను అత్యాచారం చేసిన నిందితులను గుజరాత్‌ ప్రభుత్వం…గత అగస్టు 15న రెమిషన్ కింద విడుదల చేశారు. బిల్కిస్‌ బానో అత్యాచార దోషుల విడుదల చేసిన వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కోరారు. రేపిస్టులకు స్వాగతం చెప్పడం సమాజానికి చెంపపెట్టు అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో వరుస ట్వీట్లు చేశారు. ఇలాంటి పరంపర సాగడం మొద‌లుకాక ముందే ఈ ప్రమాదపు సంప్రదాయాన్ని ఆపాల్సిన అవసరం ఉందని తెలిపారు. రేపిస్టులు, హత్య చేసిన వారు జైలు నుంచి విడుద‌లైన త‌ర్వాత‌ వారికి స్వాగతం చెప్పడం సమాజానికి చెంపపెట్టు అని అన్నారు

రెమిషన్ విధానం కింద 2002, ఆగస్టు 15 నాటి బిల్కీస్ బానో అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదిత‌మే. జైలు నుంచి బయటకు వచ్చిన ఖైదీలకు ఒక సంస్థకు చెందిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు మిఠాయిలు తినిపిస్తూ పూలదండలతో స్వాగతం చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అత్యాచారం, హత్య వంటి తీవ్రమైన నేరాలు చేసిన వారిని పవిత్రమైన స్వాతంత్ర్య‌ దినోత్సవ సందర్భంగా విడుదల చేయడం ఆ రోజుకు ఉండే పవిత్రతకు కళంకం అని పేర్కొన్నారు.

రేపిస్టులు, జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిని క్షమించరాదని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ దోషుల‌ను విడుద‌ల చేయ‌డం స‌రికాద‌న్నారు. నెలల గర్భిణీని రేప్ చేయడం, ఆమె మూడేళ్ల చిన్నారిని హత్య చేసిన రేపిస్టులను విడుదల చేసి గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం సున్నితత్వం లేని తనాన్ని ప్రదర్శించిందని విమర్శించారు. ఇది చట్ట విరుద్ధమే కాకుండా మానవత్వానికి కూడా వ్యతిరేకమ‌ని స్పష్టం చేశారు. ఒక మహిళగా బిల్కీస్ బానో అనుభవించిన బాధను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -