స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై జాతీయజెండాను ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అనంతరం జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని..ఆజాదీ కా అమృత్ ఉత్సవాలు భారత్ కు మాత్రమే పరిమితం కాలేదని, ప్రపంచ వ్యాప్తంగా మన జాతీయ జెండా రెపరెపలాడిందని మోదీ తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది వీరులు ప్రాణత్యాగం చేశారని, దేశంకోసం పోరాడిన వీరనారీమణులకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు.
దేశం నవ సంకల్పంతో ముందుకెళ్తోందని అన్నారు. న్యూ ఇండియా సాకారం కోసం కృషిచేస్తున్న ప్రతీ భారతీయుడికి ఈ దేశం సెల్యూట్ చేస్తుందని తెలిపారు. త్యాగధనుల పోరాట ఫలితమే మన స్వాతంత్ర్యమని, ఎంతోమంది మహనీయులు మనకు స్వాతంత్ర్యాన్ని అందించారని, బానిస సంకెళ్ల ఛేదనలో వారి పోరాటం అనుపమానమని కొనియాడారు. న్యూ ఇండియా సాకారంకోసం కృషి చేస్తున్న ప్రతీ భారతీయుడికి ఈ దేశం సెల్యూట్ చేస్తుందని ప్రధాని తెలిపారు.
ఎంతో మంది మహనీయులకు ఈ దేశం జన్మనివ్వడం మన అదృష్టం అని మోదీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లిలాంటిదని, స్వాంతంత్ర్య సమరయోధులు బ్రిటీష్ వ్యవస్థ మూలాలను కదిలించారని అన్నారు. పోలీసులు, ఇండియన్ ఆర్మీ ఫోర్స్ కు మోదీ సెల్యూట్ చేశారు.భిన్నత్వంలో ఏకత్వం దేశానికి బలమన్న మోదీ.. దేశం మొత్తం సమిష్టిగా కరోనాను తరిమికొట్టిందని అన్నారు.