ఇవాళ రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం వాయుగుండం ఏర్పడిందని, ఇది పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నదని వెల్లడించింది. సోమవారం ఉదయం వరకు వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. దీనిప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండకపోయినప్పటికీ.. ఈ నెల 18 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
కాగా, హైదరాబాద్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నది. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన వాన సాయంత్రానికి తగ్గిపోయింది. అయితే సోమవారం ఉదయం నుండే వర్షం పడుతుండటంతో రోడ్లన్ని జలమయమయ్యాయి.