తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ రైల్వే శాఖ గుడ్ న్యూస్‌ను ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నాలుగు సర్వీసులను ప్రత్యేకంగా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య రాయ్‌చూర్ మీదుగా రెండు సర్వీసులు ప్రత్యేకంగా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలియజేసింది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు మార్గాల్లోనూ లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సేరం, కృష్ణ, రాయ్‌చూర్, మంత్రాలయం రోడ్, ఆధోని, గుంతకల్, తాడిపత్రి, యెర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయని పేర్కొన్నారు. ఈనెల 15 పంద్రాగస్టు సాయంత్రం 06.20 గంటలకు ప్రత్యేక రైలు (నెం.07411) సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.30 గం.లకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకోటుందని వివరించారు. ఆగస్టు 16న సాయంత్రం 05.15 గం.లకు ప్రత్యేక రైలు (నెం.07412) తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06.25 గం.లకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుందని వెల్లడించారు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య విజయవాడ మీదుగా రెండు సర్వీసుల ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలియజేసింది. రెండవ మార్గంలో ఈ ప్రత్యేక రైళ్లు జనగామ, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయని వివరించారు. ఆగస్టు 17 సాయంత్రం 06.40 గం.లకు ప్రత్యేక రైలు (07473) సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06.45 గం.లకు తిరుపతికి చేరుకుంటుందని తెలిపారు. ఆగస్టు 18వ తేదీన సాయంత్రం 05.00 గం.లకు ప్రత్యేక రైలు (నెం.07474) తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.45 గం.లకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుందన్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో జనరల్ సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్ కోచ్‌లు ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపారు.