విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో స్థిరమైన స్థానం ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా నిలబడ్డాడు. ఆయన కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ అయిన చిత్రం కార్తికేయ. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా అదే టీమ్‌తో కార్తికేయ2 తీశాడు. ఎన్నో అవంతరాల నడమ నేడు ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో కార్తికేయ2 పై హైప్ క్రియేట్ అయింది. ఈ భారీ అంచనాల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
ఈ సినిమా కథంతా ద్వాపర యుగంలోని ద్వారక నగరానికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ తిరుగుతుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కాలికి ధరించిన కంకణం.. నేటి కలియుగంలోని ఎన్నో అంతుచిక్కని సమస్యలకు పరిష్కారం చూపుతుందని ప్రముఖ ఆర్కియాలజిస్ట్ రావు తెలుసుకుంటారు. ఆ కంకణం గురించి అశ్వేషిస్తున్న రావు హత్య చేయబడతాడు.
అదే సమయంలో తల్లి (తులసి)తో కలిసి ద్వారక దర్శనానికి వచ్చిన డాక్టర్ కార్తిక్ (నిఖిల్)ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆర్కియాలజిస్ట్ రావును కార్తిక్‌కే హత్య చేశాడని తప్పుడు కేసు నమోదు చేస్తారు. పోలీసు స్టేషన్‌లో ఉన్న కార్తిక్‌ని రావు మనవరాలు ముగ్ధ (అనుపమా పరమేశ్వరన్) తప్పిస్తుంది. అసలు కార్తిక్‌ని ముగ్ఢ ఎందుకు తప్పించింది? ఆమె కార్తిక్‌తో చెప్పిన విషయం ఏంటి? శ్రీకృష్ణుడి కంకణం కనిపెట్టాలని కార్తిక్ ఎందుకు డిసైడ్ అవుతాడు? ఈ క్రమంలో కార్తిక్‌కు డాక్టర్ శాంతను (ఆదిత్యా మీనన్) నుంచి ఎటువంటి ప్రమాదాలు ఎదురయ్యయాయి? అధీరుల తెగకు చెందిన వ్యక్తులు కార్తిక్‌ని చంపేందుకు ఎందుకు ప్రయత్నించారు. చివరకు కార్తిక్ కంకణ రహస్యాన్ని కనిపెట్టాడా? లేదా? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
దర్శకుడు చందూ మొండేటి మొదటి నుంచి చెబుతున్నట్లుగా కార్తికేయ చిత్రానికి, కార్తికేయ2 కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. కేవలం హీరో, అతని తల్లి పాత్రలు అలా ప్రవర్తిస్తాయి. కానీ కార్తికేయలో మిస్టరీ, థ్రిల్లర్ అంశాలు ఉంటే.. ఇందులో అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. దైవం, సైన్స్ రెండింటిని కలిపి ఆసక్తికరంగా సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాఫ్‌లో మొత్తం సింపుల్‌గా సాగుతున్నప్పటికీ.. సెకండాఫ్‌పై మాత్రం క్యూరియాసిటీ అమాంతం పెరిగిపోతుంది.
అధీరుల వంశానికి చెందిన ఓ వ్యక్తి కార్తిక్‌పై దాడి చేయడం.. దానికి కారణం ఏంటో యానిమేషన్ ద్వారా చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ తర్వాత కథలో వేగం పెరుగుతుంది. శ్రీకృష్ణ కంకణం అన్వేషణని ఆసక్తికరంగా చిత్రికరించాడు. గోవర్థన గిరి గుహలో లభించిన ఆధారంతో కంకణాన్ని కనిపెట్టడం.. దానిని తీసుకొచ్చేందుకు కార్తిక్ చేసిన ప్రయత్నం రక్తి కట్టిస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని క్లైమాక్స్ వరకు ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు.
కథ పరంగా చూస్తే కార్తికేయ2 చాలా సాదారణమైనది..కానీ కథనం మాత్రం కొత్తగా ఆకట్టుకునేలా ఉంటుంది. కార్తికేయ మాదిరి ఇందులో భయపడే సీన్స్ పెద్దగా ఉండవు. అలాగే హీరోని ఢీకొట్టేందుకు బలమైన విలన్ లేకపోవడం చిత్రాన్నికి మైనస్. కొన్ని సన్నివేశాలు చప్పగా సాగాయనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే విలన్, అధీరుల తెగకు చిక్కిన ప్రతీసారి సీన్‌లన్ని హడావిడిగా ముగించి వేరే సీన్‌లోకి తీసుకెళ్లడంతో థ్రిల్ మూమెంట్స్ మిస్ అవుతారు. శ్రీకృష్ణుడి గొప్పదనం గురించి అనుపమ్ ఖేర్‌తో చెప్పించే డైలాగ్స్ ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఫోకస్ అంతా కృష్ణతత్వం మీదే పెట్టినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. కమర్షియల్ హంగుల కోసం సాంగ్స్, కామెడీని జోడించకుండా ఉత్కంఠభరితంగా కథను నడిపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.
ఎవరెలా చేశారంటే…
డాక్టర్ కార్తికేయ పాత్రలో నిఖిల్ ఒదిగిపోయాడు. ఇలాంటి పాత్రని అల్రెడీ కార్తికేయ చిత్రంలో పోషించిన అనుభవం ఉండటం అతనికి కలిసొచ్చింది. కార్తికేయ మాదిరే కార్తికేయ 2 కథ మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు. ఇక ముగ్ధ పాత్రకి అనుపమ పరమేశ్వరన్ న్యాయం చేసింది. కార్తిక్‌ని కాపాడే రెండు సీన్స్ అనుపమా క్యారెక్టర్‌ని గుర్తిండిపోయేలా చేస్తాయి. ఇక బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా.. గుర్తిండిపోయే పాత్ర చేశారు. కార్తిక్ మామగా శ్రీనివాస్‌రెడ్డి, ట్రాలీ డ్రైవర్‌గా వైవా హర్ష తమదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. ప్రవీణ్, సత్యలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే
ఇక ఈ సినిమాలో టెక్నికల్ టీం విషయానికి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది విఎఫ్ఎక్స్ వర్క్ గురించి, మొదటి భాగం అలాగే రెండో భాగంలో కూడా ఈ విఎఫ్ఎక్స్ తమ పనితనాన్ని చూపించాయి. విఎఫ్ఎక్స్ టీం ఒకరకంగా సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్లే ప్రయత్నం చేసింది. అలాగే ఆర్ఆర్ తో కాలభైరవ, సినిమాటోగ్రఫీతో కార్తీక్ ఘట్టమనేని కూడా మ్యాజిక్ చేశారు. కొన్ని పాటలే ఉన్న కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కాలభైరవ తన పనితనాన్ని చూపించారు. కార్తీక్ ఘట్టమనేని కూడా అద్భుతమైన లొకేషన్ లను మరింత అద్భుతంగా తీర్చిదిద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఎడిటింగ్ కూడా కార్తీక్ ఘట్టమనేని చూసుకున్నారు అయినా ఎక్కడ వంకపెట్టే విధంగా లేకుండా చూసుకున్నారు. ఇక నిర్మాణ విలువలు సినిమాకు తగినట్లుగానే అద్భుతంగా కుదిరాయి.
ఫైనల్ గా సినిమా గురించి చెప్పాలంటే
ఈ సినిమా థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. కానీ కొన్ని లాజిక్స్ మిస్సయ్యాయి అనే ఫీలీంగ్ పక్కన పెడితే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయదగిన పర్ఫెక్ట్ మిస్టరీ థ్రిల్లర్ ఈ మూవీ.
నటీనటులు – నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, KS శ్రీధర్, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, సత్య & వైవా హర్ష
దర్శకత్వం – చందూ మొండేటి
నిర్మాతలు: TG విశ్వ ప్రసాద్ & అభిషేక్ అగర్వాల్
సహ నిర్మాత: వివేక్ కూచిభోట్లా
సినిమాటోగ్రఫీ- ఎడిటింగ్: కార్తీక్ ఘట్టమ్నేని
సంగీతం: కాల భైరవ
VFX సూపర్‌వైజర్: నిఖిల్ కోడూరు
కార్తికేయ 2 మూవీ రేటింగ్: 3.5/5