స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మాదాపూర్ ఇనార్బిట్ మాల్‌లో ప్రదర్శిస్తున్న గాంధీ చలన చిత్రాన్ని వీక్షిస్తున్న విద్యార్థులతో ఇవాళ సీఎస్ సోమేశ్ కుమార్ కలిసి ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులకు గాంధీ సినిమా చూపించడంపై ఇతర రాష్ట్రాల అధికారులు ఆసక్తి చూపుతున్నారని, ఇక్కడ ఇంత పెద్ద సంఖ్యలో ఎలా చూపిస్తున్నారని వాకబు చేస్తున్నారని సోమేశ్ కుమార్ వెల్లడించారు.
సినిమా చూసిన విద్యార్థులందరూ ఇంటికి వెళ్లిన తర్వాత.. ఆ సినిమాపై మీకు ఏర్పడిన అభిప్రాయాల గురించి సవివరంగా వ్యాసాలు రాయాలని సీఎస్ సూచించారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా స్వాతంత్రోద్యమాన్ని తెలియ చేసే గాంధీ సినిమాను తెలంగాణలో 552 సినిమా హాళ్లలో 22 లక్షలకు పైగా స్కూల్ విద్యార్థులు వీక్షిస్తున్నారని, అవసరమైతే ఈ సినిమా ప్రదర్శనను మరికొన్ని రోజులు పొడిగిస్తామని తెలిపారు. ఈ సినిమాను ప్రతీ ఒక్క విద్యార్థి చూసి స్వాతంత్ర్య స్ఫూర్తి పొందాలనేది రాష్ట్ర సీఎం కేసీఆర్ అభిమతమని సీఎస్ స్పష్టం చేశారు.