తిరుమలలో నేటి నుండి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాల్లో మొదటి రోజైన సోమవారం పవిత్రాల ప్రతిష్ట, 9న పవిత్ర సమర్పణ, 10న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు. మూడు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణసేవలతో పాటు 9న శ్రీవారి ప్రధాన ఆలయంలో జరిగే అష్టదళపాదపద్మారాధన కార్యక్రమాన్ని సైతం రద్దు చేసింది.