దేశంలోని ప్రతి రాష్ట్రాన్నికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు, సమస్యలు ఉంటాయన్నారు ముఖమంత్రి కేసీఆర్. కేంద్రం ఇచ్చే గ్రాంట్ నేరుగా రాష్ట్రాలకు ఇవ్వాలని చెబితే ప్రధానమంత్రి అంగీకరించారు. సహకార సమాఖ్య విధానం పోయి ఆదేశిత సమాఖ్య విధానం వచ్చింది. మేము చెప్పింది చేయకపోతే మీ కథ చూస్తాం అనే పరిస్థితికి వచ్చారు. హనుమాన్ జయంతి రోజు దిల్లీ నడి వీధుల్లో కత్తులు పట్టుకుని స్వైర విహారం చేస్తున్నారు. అంతర్జాతీయ విపణిలో మన దేశ పరువు పోతోంది. ఆర్థిక వేత్తలు ఎంత చెబుతున్నా పట్టించుకోవడం లేదు. నీతి ఆయోగ్ రూపకల్పనలో ఎవరికీ ప్రమేయం ఉండదు. ఎవరు ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. పన్నుల వసూలులో రాజ్యాంగపరంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి. రాష్ట్రాలకు రావాల్సిన రూ.14 లక్షల కోట్ల నిధులను కొల్లగోట్టారు. టీమ్ ఇండియా చేసే పని ఇదేనా నీతి ఆయోగ్ సమావేశం భజన మండలి సమావేశంగా మారింది.
ప్రగతి పథంలో దూసుకెళ్తున్న రాష్ట్రాల కాళ్లలో కట్టెలు పెట్టవద్దని నీతి ఆయోగ్ సమావేశాల్లో చెప్పాను. దేశం మొత్తానికి విద్యుత్, నీళ్లు ఎలా ఇవ్వొచ్చో వివరించా కానీ నా సూచనలను నీతి ఆయోగ్ పెడచెవిన పెట్టింది. రాష్ట్రంలో ఎన్నో పథకాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. కేంద్రం నుంచి ప్రశంసలే తప్ప నిధులు రాలేదు. కేంద్ర రాష్ట్ర ఉమ్మడి పథకాల్లో తెలంగాణ రూ.1.92 లక్షల కోట్ల ఖర్చు చేసింది. కేంద్రం నుంచి మాత్రం రాష్ట్రానికి రూ.5 వేల కోట్లు వచ్చాయి. కేంద్రానికి మేము పంపించిన ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలు చేశారు. జీఎస్టీ బకాయిలు కూడా చెల్లించకుండా పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
దేశంలో ఏకస్వామ్య పార్టీ విధానం వస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అన్నారు. ఈ నిరంకుశ విధానం దేశానికి మంచిదా అని ప్రశ్నించారు. రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటున్నారు. మీరు కబళించిన రాజ్యాంగ సంస్థలే రేపు మిమ్మల్ని కూడా కబళిస్తాయి. దేశమంతా ఏక్‌నాథ్ షిండేలను సృష్టిస్తామని బెదిరిస్తున్నారు. ఇదేనా సమాఖ్య స్పూర్తి ప్రభుత్వాలను కూల్చడమే సమాఖ్య విధానమా? పాలు, పెరుగు మీద పన్ను చివరికి శ్మశానంలో కూడా పన్ను వేస్తున్నారు. గార్భా అనే నృత్యం మీద కూడా పన్ను వేశారు. ఇప్పటికైనా ప్రధాని తన బుద్ధి మార్చుకుంటారనే సమావేశాన్ని బహిష్కరిస్తున్నా.
ఉచిత పథకాలు రద్దు చేయాలని కొత్తగా తెరలేపారు. వృద్ధులకు పింఛన్లు ఇవ్వడం ఉచితమా, రైతులకు రైతుబంధు, రైతు బీమా ఇవ్వడం ఉచితమా, కొన్ని సంస్థలకు ఎన్‌పీఏల కింద రూ.12లక్షల కోట్లు ఇచ్చారు. ఎన్‌పీఏలు రూ.2లక్షల కోట్లు నుంచి 20 లక్షల కోట్లకు పెరిగాయి. మహత్తరమైన పాలన అందిస్తే ఎన్‌పీఏ తగ్గాలి కదా? ఎందుకు 10 రేట్లు పెరిగింది. కొన్ని సంస్థలు అధికారులు కుమ్మక్కై ఎన్‌పీఏలకు దోచిపెడుతున్నారు. కొందరు రూ.లక్షల కోట్లు బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయారు. మేకిన్ ఇండియా అంటే పతంగులు ఎగరేసే మాంజా కూడా చైనా నుంచే వస్తుందా? మేకిన్ ఇండియాతో దిగుమతులు తగ్గాలి కాని పెరగుతున్నాయి. ఇండియా భూభాగం 80 కోట్ల ఎకరాలు అందులో సాగుకు పని కొచ్చే భూమి 40 కోట్ల ఎకరాలు. విదేశీ మారక నిల్వలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. మన దేశంలో కూడా శ్రీలంక పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారని సీఎం వివరించారు. దేశంలో ఆర్థిక పరిస్థితి తిరోగమనంలోకి వెళ్తుందని హెచ్చరించారు.