దేశ అత్యున్నత రెండవ పదవైన ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్దం చేస్తున్నారు అధికారులు. ఎన్డీయే అభ్యర్థిగా జగదీప్‌ధనఖర్ పోటిలో నిలబడ్డారు. కాగా విపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కర్ణాటకకు చెందిన మార్గరేట్ అల్వాను బరిలో నిలపాలని ఆదివారం ఏకగ్రీవంగా ఆయా పార్టీలు నిర్ణయించాయి. తాజాగా విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి మార్గరెట్ అల్వా మంగళవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆగస్ట్ 10న ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుండగా నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్ట్ 6న జరగనుంది.
మార్గరెట్ అల్వా వెంట కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఎన్‌సీపీ నేత శరద్ పవార్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డీ రాజా, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరి సహా పలువురు విపక్ష నేతలు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
తనను బలపరిచిన విపక్ష పార్టీలకు ధన్యవాదాలు తెలిపిన మార్గరెట్ అల్వా ఈ ఎన్నికలు సవాల్‌తో కూడినవని తనకు తెలుసని, అయినా ధైర్యంగా ఎన్నికల బరిలో దిగానని ఆమె పేర్కొన్నారు. ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధి, పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా వైదొలగిన జగదీప్ ధన్‌ఖర్‌పై మార్గరెట్ అల్వా పోటీ చేస్తున్నారు.