రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు మంత్రులు తమ తమ జిల్లాలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్లా జిల్లాలోని పలు గ్రామాలలో పర్యటించారు. జిల్లాలో ఒక్క ప్రాణనష్టం కూడా ఉండొద్దని, వర్షాలపై అధికారులు అలక్ష్యంగా ఉండకూడదని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో సిరిసిల్లలోని కలెక్టరేట్లో జడ్పీ చైర్పర్సన్, కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్, ఇరిగేషన్, ఇంజినీరింగ్ విభాగాలు, వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో ఆయన సమీక్షించారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ జులైలో అత్యధిక వర్షపాతం నమోదైందన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సాధారణం కంటే 450 శాతం ఎక్కువ వర్షం కురిసిందన్నారు. కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్, ఇతర ఉన్నతాధికారులు ప్రో ఆక్టివ్ గా ఉండాలన్నారు. మున్సిపాలిటీతో సహా అన్ని గ్రామాల్లో అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నిర్మాణ పనులు జరిగే చోట హెచ్చరిక సంకేతాలు పెట్టాలని, బారికేడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలపై అధికారులు ఉదాసీనంగా ఉండకూడదని, జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చూడాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.