మహారాష్ట్ర విధాన సభలోని శివసేన కార్యాలయం తమదంటే తమదని ఇరు వర్గాలు వాదించుకున్నాయి. శివసేన ఉద్ధవ్ వర్గం, షిండే వర్గం ఎమ్మెల్యేలు ఆదివారం అసెంబ్లీకి వచ్చారు. ఇరువర్గాలు మాదంటే మాదని ఘర్షణ వాతావరణం కల్పించారు. ఈ నేపథ్యంలో కార్యాలయంకు అధికారులు సీల్ వేశారు. దీనికి సంబంధించిన ఒక నోటీసును కూడా కార్యాలయం దర్వాజకు అంటించారు. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే బీజేపీ మద్దతుతో సీఎం అయ్యారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైనందున్న గవర్నర్ సోమవారం అసెంబ్లీలో బల నిరూపణకు ఆదేశించారు. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
39 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, 11 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కలిపి 50 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని తిరుగుబాటు తొలి నుంచి ఏక్నాథ్ షిండే అంటున్నారు. తాము శివసేనను వీడలేదని, బాలాసాహెబ్ సిద్ధంతం మేరకు బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు షిండే వర్గం పేర్కొంది. శివసేనకు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని, తామే అసలైన శివసైనికులమని వాదించుకుంటున్నారు.
మరోవైపు సంఖ్య ఉన్నంత మాత్రాన అసలు శివసేనగా చెప్పుకోలేరని, పార్టీపై పెత్తనం, ఎన్నికల గుర్తు రెబల్స్‌కు దక్కవని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. పార్టీ నుంచి బయటకు వెళ్లి పార్టీని సొంతం చేసుకోవడం అంత సులువు కాదనన్నారు. అసలు శివసేనగా పేర్కొనేందుకు చట్టపరమైన అంశాలు చాలా ఉంటాయని చెప్పారు.