తెలంగాణ మహంకాళి జాతర, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ విజయవాడలోని కనకదుర్గమ్మకు గత 13సంవత్సరాలుగా బంగారు బోనం సమర్పిస్తున్నమన్నారు. ప్రతి యేటా ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నమన్నారు. ఆలయ కమిటీ ఈవో భ్రమరాంబ, స్థానచార్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి బంగారు బోనం, సారె సమర్పించారు.
లయబద్ధమైన డప్పుచప్పుళ్లకు అనుగుణంగా రంగురంగుల పోతరాజుల నృత్యాలతో బ్రాహ్మణ వీధి నుంచి ఆలయ ప్రాంగణం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అన్నం, బెల్లం, పెరుగుతో తయారు చేసిన సంప్రదాయ బోనాలను తలపై పెట్టుకుని మహిళా భక్తులు ఆలయానికి తరలివెళ్లారు. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని అమ్మవారికి తెలంగాణ తరపున సారెను సమర్పించి 31 బోనాలతో ఊరేగించి పూజలు నిర్వహించామన్నారు. తెలంగాణకు చెందిన కమిటీ సభ్యులు, కళాకారులు దుర్గాఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

