తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గ్రూపులు, నాయకుల మధ్య పోరు పెద్ద తలనొప్పిగా తయారైంది. మీ మీ రాజకీయాలతో పార్టీకి నష్టం చేస్తే ఊరుకోను అంటూ రాహుల్ గాంధీ స్వయంగా హెచ్చరించి వెళ్లారు. అయితే, రాహుల్ పర్యటనతో పాటు రైతు డిక్లరేషన్ ఇంపాక్ట్ ఎలా ఉంది…? రైతులు స్వాగతించారా…? కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఇంటింటికి వెళ్లి డిక్లరేషన్‌ను చేర్చారా…? ఏ జిల్లాలో ఏయే నాయకులు పర్యటించారు, నియోజకవర్గాల్లో నేతలు రచ్చబండ పెట్టారా…? అన్న అంశాలపై అధిష్టానం ఆరా తీసినట్లు తెలుస్తోంది.
రాహుల్ పర్యటన తర్వాత తెలంగాణలో పార్టీ పరిస్థితులు, నాయకుల తీరు, అసంతృప్తి నాయకులు మారారా, రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు తగ్గాయా.. ఇలా అన్ని అంశాలపై కాంగ్రెస్ పార్టీ వ్యూహాకర్త సునీల్ కనుగోలు ఏఐసీసీకి రిపోర్టు పంపినట్లు తెలుస్తోంది. ప్రతి అంశంపై క్షుణ్ణంగా నివేదిక తెప్పించిన ఆయన… పార్టీ కీలక నేత కేసీ వేణుగోపాల్ ద్వారా రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి సునీల్ కనుగోలు నివేదిక సమర్పించినట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఓవైపు సీఎం కేసీఆర్ ముందస్తుకు రెడీ అవుతుండటం, జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడుతూ… కీలక భేటీలు నిర్వహిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నాయకులు ఇంకా అలెర్ట్ కాకపోవటంపై రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు జూబ్లిహీల్స్ కేసును అందిపుచ్చుకోవటంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం అయ్యిందని… ఒక్క నేత బయటకు రాలేదని, మహిళా నేతలు కూడా అంతంతమాత్రంగా స్పందించారని నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. ఇలా చాలా అంశాల్లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించటంలో విఫలం అవుతుందని, ఇలాగే జరిగితే టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఏమాత్రం సరిపోదని సునీల్ తన నివేదికలో పొందుపర్చినట్లు ఏఐసీసీ వర్గాలంటున్నాయి. ఈ నివేదిక చూసిన తర్వాత తెలంగాణ నాయకులపై రాహుల్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, ఈడీ కేసుల విచారణ ముగియగానే రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలను ఢిల్లీకి పిలిచి క్లాస్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.