విక్రమ్ సక్సెస్ మీట్ లో కమల్ హాసన్ ‘విక్రమ్’ను బిగ్గెస్ట్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్ లోరూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రేష్ఠ్ మూవీస్’ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో భారీగా విడుదల చేశారు. జూన్ 3 విడుదలై ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో రానా దగ్గుబాటి ఈ వేడుకకు అతిధిగా హాజరయ్యారు.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. “విక్రమ్ సినిమాని ‘శ్రేష్ఠ్ మూవీస్’ కి ఇచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. నితిన్, సుధాకర్ రెడ్డి వల్లే విక్రమ్ ప్రేక్షకులకు భారీగా చేరువైయింది. వీరి వలనే చాలా థియేటర్స్ లో విడుదల, భారీగా పబ్లిసిటీ చేయడం జరిగింది. ఈ సినిమాని సుధాకర్ రెడ్డికి ఇస్తూ మా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నా జాగ్రత్త అని చెప్పా. సుధాకర్ రెడ్డి ఆ బిడ్డని రికార్డ్ బ్రేకింగ్ చైల్డ్ గా చేశారు. లోకేష్ కనగరాజ్ విక్రమ్ ని అద్భుతంగా తీశారు. ఆయన ఖైదీ చూసి ఒక అవకాశం ఇచ్చాము. ఆ అవకాశాన్ని ఆయన అద్భుతంగా చూపించారు. సినిమా గొప్పగా వుంటుందని తెలుసు, ఇంత గొప్పగా వుండటం సర్ప్రైజ్ గా వుంది” అని అన్నారు.
ఆయన ఈ సందర్భంలో రానా గురించి మాట్లాడుతూ.. రానా ఎత్తులోనే కాదు విజయాల్లోనూ ఎంతో ఎత్తుకి ఎదిగారు. రానా నాకు టెక్నిషియన్ గా కూడా తెలుసు. రానా కి నేను ఎంత ఇష్టమంటే నా సినిమా ఫెయిలైనా కూడా బావుందని మెచ్చుకునేవారు” అని పేర్కొన్నారు.
ఈ సినిమా వెనుక నిర్మాత మహేంద్రన్ కృషి చాలా వుంది. అయితే ఆయన మీడియా ముందుకు ఎక్కువగా రారు. ఆయనకి కృతజ్ఞతలు. విక్రమ్ కి వండర్ ఫుల్ టెక్నిషియన్స్ పని చేశారు. అనిరుద్, గిరీష్ గంగాధరన్.. ఇలా అందరూ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. సినిమాలో పాత్రలన్నీటికీ మంచి పేరు రావడం ఆనందంగా వుంది. ప్రేక్షకులు విక్రమ్ ని గొప్పగా ఆదరించారు. మళ్ళీ గొప్పగా స్వాగతం పలికారు. ‘మరో చరిత్ర’ తర్వాత నాకు స్టార్ స్టేటస్ వచ్చింది. ఈ విషయంలో నేను ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతగా వుంటాను. మరో చరిత్ర సబ్ టైటిల్స్ లేకుండా చెన్నైలో రెండున్నరేళ్ళు ఆడింది. సినిమాకి భాష లేదు. సినిమాది ప్రపంచ భాష. విక్రమ్ విజయం మరోసారి గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. అందరూ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. రీపిట్ గా చూస్తున్నామని చెబుతున్నారు. ఇలాంటి అభినందనలే మరో సినిమా ఇంకా గొప్పగా చేయడానికి ప్రేరణ కలిగిస్తాయి. విక్రమ్ ను బిగ్గెస్ట్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థాంక్స్. విక్రమ్ ఎన్ని రికార్డులు సాధించినా దానికి కారణం ప్రేక్షకులే. మీరు లేకుండా ఈ విజయం సాధ్యం కాదు. నా సినిమానే కాదు మంచి సినిమాలని మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలి” అని కోరారు.
దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ.. “విక్రమ్ ని పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ ఈవెంట్ కి వచ్చిన రానాకి థాంక్స్. ఈ సినిమాని తెలుగు లో విడుదల చేసిన నితిన్ కి సుధాకర్ కి కృతజ్ఞతలు. ఈ సినిమా విజయం సాధిస్తుందని మాకు తెలుసు. ఐతే మేము ఊహించిన దాని కంటే పెద్ద విజయాన్ని అందించారు ప్రేక్షకులు. విక్రమ్ ని ఇంతలా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు” తెలిపారు.
హీరో రానా మాట్లాడుతూ ..”నితిన్ ఫోన్ కమల్ హాసన్, లోకేష్ వస్తున్నారు పార్టీ వుంటుంది రమ్మని పిలిచారు. పార్టీకి ముందు ఒక ఈవెంట్ అక్కడికి వచ్చేయ్ అని ప్లేస్ చెప్పారు. ఇక్కడికి వచ్చి చూస్తే నితిన్ లేరు. ఈ మధ్య కాలంలో ఒకే సినిమా ఒకే రోజు రెండు భాషల్లో చూడటం ‘విక్రమ్’ కే జరిగింది. పొద్దున్న మా ఇంటి దగ్గర వున్న ఆర్ కే సినీ ప్లెక్స్ కి వెళ్లాను. అక్కడి తెలుగు వెర్షన్ చూసి మళ్ళీ ప్రసాద్ ఐమాక్స్ లో తమిళ్ వెర్షన్ చూశాను. కమల్ హాసన్ ని చూసి సినిమా గురించి నేర్చుకున్నాం. దర్శకుడు లోకేష్ కనగారాజ్ కమల్ ని చాలా కూల్ గా చూపించారు. విక్రమ్ టీమ్ కి కంగ్రాట్స్. ‘విక్రమ్’ అద్భుతమైన సినిమా.” అని అన్నారు.
నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. “విక్రమ్ బిగ్గెస్ట్ హిట్ అఫ్ ఇండియన్ సినిమా. అన్ని సినిమాలని క్రాస్ చేసి నెంబర్ వన్ స్థానంకు వెళుతుంది. విక్రమ్ లో అంత డెప్త్ వుంది. కమల్ హసన్ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ గ్రాస్ చేసిన చిత్రమిది. లొకేష కనకరాజ్, అనిరుద్ .. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరు చాలా హార్డ్ వర్క్ చేశారు. విక్రమ్ ని ఇంత గొప్పగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమా హౌస్ ఫుల్ గా రన్ అవుతుంది. విక్రమ్ విజయాన్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు” అన్నారు.
గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. “కమల్ హాసన్ ఒక లెజెండ్. ఫినామినా. కమల్ కి సంబధించిన ప్రతి చిన్న విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. విక్రమ్ ని ప్రేక్షకులు పెద్ద హిట్ చేశారు. నా గురువు, దేవుడు ఇలాంటి విజయాలతో ఎప్పుడూ మనందరికీ ప్రేరణగా నిలవాలి” అని కోరారు.