ఋతుపవనాలకు వేళాయే..

90
monsoon
- Advertisement -

వర్షాలు కురిసే సమయం వచ్చినా మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలుగు రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రెండు రాష్ట్రాలను ఋతుపవనాలు తాకనున్నాయి. దేశంలో అత్యధిక వర్షపాతం అందించే నైరుతి రుతుపవనాల విస్తరణ ఈ సారి ఆలస్యమైంది. సాధారణంగా ఈసరికే రాష్ట్రంలో నైరుతి సీజన్ మొదలవ్వాల్సి ఉండగా, ఇప్పటికీ రుతుపవనాల జాడలేదు. దీనిపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వివరణ ఇచ్చింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల విస్తరణకు అనుకూల వాతావరణం ఉందని, మరో రెండ్రోజుల్లో రుతుపవనాలు ఆయా రాష్ట్రాల్లో ప్రవేశిస్తాయని వెల్లడించింది.

వచ్చే రెండ్రోజుల్లో ఏపీ దక్షిణ, ఉత్తర కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. అదే సమయంలో, ఉత్తర భారతదేశం వైపుగా నైరుతి రుతుపవనాలు వేగంగా కదిలేందుకు అనుకూల వాతావరణం నెలకొందని ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం కర్ణాటక, గోవా, కొంకణ్, బెంగళూరు, పుణే, పుదుచ్చేరి ప్రాంతాలపై రుతుపవనాలు విస్తరించాయని ఐఎండీ వివరించింది. రుతుపవనాల గమనం నెమ్మదిగా ఉండడం వల్ల విస్తరణ ఆలస్యమైందని పేర్కొంది.

కాగా, ఋతుపవనాలు సాధారణంగా జూన్ మధ్య నాటికి దేశంలో సగం భాగాన్ని విస్తరిస్తాయి. కాగా జులై మద్య నాటికి అవి దేశం మొత్తాన్ని వ్యాపిస్తాయి. గత సంవత్సరం కూడా ఋతుపవనాలు జూన్ 1 తేదీనే వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేయగా 6 రోజులు ఆలస్యంగా జూన్ 6 తేదీన ప్రవేశించాయి. మరి ఈసారి వాతావరణ శాఖ అంచనా నిజమౌతుందో చూడాలి.

- Advertisement -