5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన మంత్రి మొక్కలు నాటారు. గ్రామంలో వాడవాడలా పర్యటించి పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. పరిచయం ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళను బయటకు పిలిచి ఆప్యాయంగా పలకరించారు మంత్రి ఎర్రబెల్లి.
గ్రామంలో పారిశుద్ధ్యం నిర్వహణపై గ్రామ సర్పంచ్, కార్యదర్శి, సిబ్బందిని అభినందించారు. అనంతరం అక్కడ జరిగిన గ్రామ సభలో అంశాల వారీగా గ్రామ పరిస్థితులను మంత్రి ఎర్రబెల్లి సమీక్షించారు. గ్రామంలో ట్రాక్టర్ ఎన్ని గంటలకు వస్తున్నది? సమయానికి చెత్త సేకరణ సక్రమంగా జరుగుతున్నదా? డంపింగ్ యార్డు వినియోగిస్తున్నారా? చెత్త ను ఎరువుగా తయారు చేస్తున్నారా? ట్రాక్టర్, చెత్త ద్వారా ఎంత ఆదాయం వస్తున్నది? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర రెడ్డి, జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, అడిషనల్ కలెక్టర్లు హమీద్, భాస్కర్ రావు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, సర్పంచ్ మందుల శిరీష, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, పెద్ద ఎత్తున మహిళలు రామవరం గ్రామ పల్లె ప్రగతి లో పాల్గొన్నారు.