శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం మేజర్. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కగా సినిమా ట్రైలర్, టీజర్‌లతోనే అంచనాలను పెంచేశారు. మరి ఇవాళ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం..
కథ:
సందీప్ ఉన్ని కృష్ణన్ (అడివి శేష్) ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన యువకుడు. డాక్టర్ చేయాలని తండ్రి,ఇంజనీర్ చేయాలని తల్లి భావిస్తుంది కానీ చిన్పప్పటి నుంచి నేవీలో చేరాలనే కోరికతో ఉండే సందీప్… ఆర్మీలో జాయిన్ అవుతాడు. ఇదే సమయంలో తనకు ఇషా (సయీ మంజ్రేకర్)తో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. సీన్ కట్ చేస్తే కుటుంబ సమస్యతో ఇంటికి బయలుదేరే సందీప్…ముంబై ఉగ్రదాడిలో ఇరుక్కుంటాడు. తర్వాత ఏం జరుగుతుంది…అసలు సందీప్ కుటుంబంలో వచ్చిన సమస్య ఏంటి? అనేదే మేజర్ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,అడవి శేష్ నటన, నేపథ్య సంగీతం. తన నటనతో ప్రేక్షలను ఇంప్రెస్ చేశారు అడవి శేష్. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. లుక్ పరంగా ఇందులో శేష్.. మూడు వేరియేషన్స్‌లో కనిపించాడు. ఇంటర్ చదివే కుర్రాడిగా,యుక్త వయస్కుడిగా, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికుడిగా. మూడు వేరియేషన్స్‌లో అద్భుతంగా నటించాడు. భర్త ప్రేమ కోసం ఎదురు చూసే ఇల్లాలి పాత్రలో సయీ మంజ్రేకర్ చక్కగా చేసింది. ఇక మిగితా నటీనటుల్లో ప్రకాష్ రాజ్ , రేవతి,మురళీ శర్మ, శోభితా దూళిపాళ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఫస్టాఫ్‌పై కాస్త దృష్టి సారిస్తే బాగుండేది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా సూపర్బ్. నిమాలో ఏం చెప్పాలనుకున్నారనే విషయాన్ని క్లారిటీగా చెప్పారు శశికిరణ్ తిక్క. సందీప్ ఉన్ని కృష్ణన్‌కి సంబంధించిన విషయాలను చూపిస్తూనే సినిమాలో ఉండాల్సిన లవ్, ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ సమపాళ్లలో యాడ్ చేశారు. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. వంశీ పచ్చి పులుసు సినిమాటోగ్రఫీ, డైలాగ్‌లు బాగున్నాయి. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పోల్చితే ఇలాంటి బయోపిక్‌ను తెరకెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా దేశం కోసం ప్రాణ త్యాగం చేసి సందీప్ వంటి వీరుల జీవిత చరిత్రలను సినిమా రూపంలో ఆవిష్కరించేటప్పుడు ఎంతో హోం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు చాలాజాగ్రత్తలు తీసుకున్నాడు. అడవిశేష్ నటన,కథ సినిమాకు ప్లస్ పాయంట్స్. ఓవరాల్‌గా ఓ దేశ భక్తుడి కథ.. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరుడి కథ. అందరూ ఖచ్చితంగా చూడాల్సిన చిత్రం మేజర్.
విడుదల తేదీ:3/6/2022
రేటింగ్:3/5
నటులు:అడివి శేష్,సయీ మంజ్రేకర్
సంగీతం:శ్రీచరణ్ పాకాల
నిర్మాత:మహేశ్ బాబు, సోనీ పిక్చర్స్
దర్శకుడు: శశి కిరణ్ తిక్కా