తెలంగాణ విషయంలో బీజేపీ ద్వంద విధానాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో ఖండించారు. అధికారం కోసమే బీజేపీ ఆరాటం, తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవు అన్నారు. సకల జనుల, సకల సంస్కృతుల సమాహారం తెలంగాణ. ఎనిమిదేళ్లకు బీజేపీకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గుర్తుకు వచ్చిందన్నారు.
తల్లిని చంపి పిల్లను బతికించారని ప్రధాని అంటారు, కాని తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు మాత్రం అమిత్ షా వస్తారు అని అన్నారు. నివాళులు అర్పించడం కాదు,తెలంగాణకు న్యాయంగా కేంద్రం నుండి రావాల్సిన నిధులు ఇవ్వండి అని ప్రశ్నించారు. ఉపన్యాసాలు కాదు,తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వండి అని అడిగారు. ఎనిమిదేళ్లలో బీజేపీ రాష్ట్రానికి ఏమిచ్చింది ? అని నిలదీశారు. బీజేపీ 2014 , 2018 ఎన్నికలలో దేశ ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, అని డిమాండ్ చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని రైతుల సాగు ఖర్చులు రెట్టింపు చేశారు. కనీస మద్దతుధరకు చట్టబద్దత ఎందుకు కలిపించలేదు ? దేశానికి జాతీయ వ్యవసాయ విధానం తీసుకు రావాలనే ఆలోచన కేంద్రానికి ఎందుకు లేదు ? అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలుచేసి చూపాలని అడిగారు. తెలంగాణకు రాజకీయ టూరిస్టులు మొదలయ్యారు.. అడ్డగోలు హామీలు ఇస్తున్నారు. జాతీయ పార్టీ లకు ఒక విధానం లేదు, కాని రాష్ట్రానికో విధానం అవలంబిస్తున్నారు అని గేలి చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ మాత్రమే న్యాయం చేస్తారు. ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన అవార్డులే దానికి నిదర్శనం అని వెల్లడించారు.