ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల(26)న హైదరాబాద్ రానున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవంలో ప్రధాని పాల్గోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానికి ఘనస్వాగతం పలికేలా బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ సోమేశ్ కుమార్ స్వాగతం పలకనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు స్వాగతం పలకనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక్క ఐఎస్‌బీలోనే 2వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు.
ప్రధాని పర్యటనలో ఎక్కడా అపశ్రుతులు దొర్లకుండా విద్యార్థుల సామాజిక మాధ్యమాలను తనిఖీ చేసి, ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక భావాలు కలిగి ఉన్నట్లు గుర్తిస్తే హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటన దృష్ట్యా ప్రధాని కార్యక్రమానికి హాజరు కావడం లేదని సమాచారం.