టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ. ప్రజలే ఎజెండాగా ప్రాంతీయ పార్టీలు పనిచేస్తాయని.. మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీ వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలన్నారు. అక్కడ కాంగ్రెస్ ఒక తోక పార్టీ అని, కేంద్రంలోనూ అదే గతి పడుతుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో కేంద్రాన్ని పాలించేది ప్రాంతీయ పార్టీలేనని కవిత స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేతలెప్పుడూ దేశం గురించి ఆలోచించలేదని, పార్టీకి ఎలా పునరుత్తేజం తీసుకురావాలని మాత్రమే ఆలోచిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతున్నా మాట్లాడని పార్టీ.. వారి నాయకత్వ లోపం గురించి మాత్రమే ఆలోచిస్తోందని అన్నారు. ప్రాంతీయ పార్టీలు సక్సెస్ అవుతుంటే కాంగ్రెస్ వాళ్లు చూసి ఓర్చుకోలేకపోతున్నారన్నారు. ఇవాళ ప్రాంతీయ పార్టీలు మెరుగైన పాలన అందిస్తుండడం వల్లే అవి సక్సెస్ అయ్యాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రాలను ప్రాంతీయ పార్టీలు పాలిస్తున్నాయని, భవిష్యత్తులో దేశాన్ని ఏలుతాయని కవిత అన్నారు. తమది రాజకీయ ఎజెండా కాదని, ప్రజల సంక్షేమమే ఎజెండా అని పేర్కొన్నారు. ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణలే అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయంటూ ఇటీవలే ఆర్బీఐ నివేదిక విడుదల చేసిందని, ఆ నివేదికను రాహుల్ తెలుసుకోవాలని ఆమె సూచించారు. ఈ మూడు రాష్ట్రాలే నిరుద్యోగిత విషయంలో సమర్థమైన చర్యలు తీసుకుంటున్నాయంటూ నివేదికలో పేర్కొన్నారన్నారు.