లండన్ లోని బ్రిటన్ పార్లమెంటు ఎదురుగా ఒక వ్యక్తి విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్స్ భవనం వద్ద తొలుత పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించిందని, తరువాత ఒక కారు పాదచారులపైకి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
బ్రిటన్ పార్లమెంట్ ముందు దుండగులు జరిపిన తుపాకీ కాల్పుల్లో 12 మందికి గాయాలయ్యాయి. సభ జరుగుతున్న సమయంలో ఈ తుపాకీ కాల్పులు జరగడం గమనార్హం. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పార్లమెంట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. కత్తితో తచ్చాడుతున్న వ్యక్తిని గమనించినట్టు అక్కడి సాక్షులు వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. దీంతో బ్రిటన్ పార్లమెంటు సమావేశాలు వాయిదా వేశారు. హతుడైన ఉగ్రవాది వద్ద పదునైన ఆయుధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంతో బ్రిటన్ పార్లమెంటులో 200 మంది ఉండడం విశేషం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.