మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారింది. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు తనను రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి సాధించుకున్న కీలకమైన స్థానం ఇప్పుడు తన చేతుల నుండి చేజారుతుంది. అవును… కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక కుటుంబానికి ఒకటే టికెట్. రెండో టికెట్ యువతకు ఇచ్చి ప్రొత్సహించాలి. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఈ నిర్ణయం ఉన్నా… పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అందుకే జానారెడ్డి తన కొడుక్కు మిర్యాలగూడ సీటు అడిగినా దక్కలేదు. కొండ సురేఖ కుటుంబానికి రెండు సీట్లు అడిగినా దక్కలేదు. కానీ, ఉత్తమ్ తన భార్యకు కోదాడ సీటు ఇప్పించుకున్నాడు.
కానీ, ఈ సారి అవేవి నడవవు… గాంధీ కుటుంబానికి కూడా ఒకే కుటుంబం, ఒకే సీటు వర్తిస్తుందని ఏఐసీసీ నిర్ణయించింది. దీంతో రాబోయే ఎన్నికల్లో మరోసారి కోదాడ నుండి తన భార్య పద్మావతిని బరిలోకి దింపి, తను హుజుర్ నగర్ నుండి బరిలో ఉండాలనుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. ఇటీవల కోదాడ కాంగ్రెస్ నేతలు కొందరు ఉత్తమ్ కు ఇంటికి వచ్చి మీరు కోదాడ రండి అని అడగ్గా… అక్కడ పద్మావతి ఉందిగా, నేను హుజుర్ నగర్ నుండే బరిలో ఉంటానని తెగేసి చెప్పాడు. అంటే మొన్నటి వరకు ఆ రెండు సీట్లు తమవేనని ధీమాగా ఉన్నారు.
కానీ ఇప్పుడు ఉత్తమ్ కు సీట్ల టెన్షన్ పట్టుకుంది. ఒకవేళ ఉత్తమ్ ఏఐసీసీ, రాహుల్ లెవల్ లో ఒప్పించి టికెట్ తెచ్చుకున్నా… గత ఏడాదిలో ఈసారి పార్టీలో నేతలు ఊరుకోరు. అప్పుడంటే పీసీసీ చీఫ్ కాబట్టి నడిచిపోయింది. ఈసారి తమకు రెండు సీట్లు కావాలి అని కోరుకునే నేతలు డజన్ మంది కాంగ్రెస్ లో ఉన్నారు. వారందరి పరిస్థితి ఏంటీ అని పీసీసీ చీఫ్ రేవంత్ స్వయంగా పంచాయితీ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీంతో కోదాడ లేదా హుజుర్ నగర్‌లో ఏదో ఒకటే ఉత్తమ్ కుమార్ కు దక్కనుంది.