తెలంగాణలో కాంగ్రెస్ నేతల తీరు అయితే అతివృష్టి లేదా అనావృష్టి అనేలా ఉంది. రాహుల్ గాంధీ వరంగల్ సభ కన్ఫామ్ కావటంతో 15రోజుల పాటు నేతలంతా చేసిన హాడావిడి అంతా ఇంతా కాదు. వామ్మో కాంగ్రెస్ నేతలంతా సడెన్ గా మంత్రం వేసినట్లుగా మారిపోయారన్న కలర్ ఇచ్చిన నేతలు, రాహుల్ వెళ్లిపోయాక మళ్లీ కనిపించకుండా పోయారు. ఈ నెల 6న రాహుల్ వరంగల్ సభ, 7న హైదరాబాద్ లో నాయకుల సమావేశం వరకు సీనియర్లుగా చెప్పుకునే నేతలతో పాటు ఇతర నేతలంతా హాడావిడి చేశారు. మీడియా ముందు, సభా ప్రాంగణాల వద్ద నేతలు అందుబాటులో ఉన్నారు. వారి అనుచరులు కటౌట్లతో హాడావిడి చేశారు. కానీ రాహుల్ వెళ్లిపోయి వారం గడుస్తున్నా నేతలంతా ఒక్కరు కూడా బయటకు రావటం లేదు.
రాహుల్ సభ పేరుతో జిల్లాల పర్యటలను చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాహుల్ టూర్ ముగిసిన మరుసటి రోజు మొక్కుబడిగా గాంధీభవన్ లో ప్రెస్ మీట్ పెట్టి వెళ్లిపోయారు. ఇక మళ్లీ కనపడలేదు. చంచల్ గూడ జైలు నుండి రిలీజ్ అయిన ఎన్.ఎస్.యూ.ఐ నేతలను ఆయన పరామర్శించలేదు. దీంతో వారే రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిసి వచ్చారు. ఇక కోమటిరెడ్డి, భట్టి, శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ, పొన్నాల, దామోదర రాజనర్సింహా, మధుయాష్కీ జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. వీరి ఎక్కడున్నారో కూడా తెలియకుండా పోయింది. దీంతో ఈ నాయకులపై క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తోంది. ఢిల్లీ నేతలు వచ్చినప్పుడు హాడావిడి చేసి ఇప్పుడు బయటకు రావటం లేదని… రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఇష్యూను కాంగ్రెస్ కు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉన్నా పట్టించుకోవటం లేదని, వడ్ల కుప్పల వద్దకు కాంగ్రెస్ ప్రోగ్రాం చేస్తే మరింత మైలేజ్ వచ్చేదంటూ రాష్ట్ర నాయకత్వంపై మండిపడుతున్నారు.