ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ప్రక్రియ కేంద్రం కసరత్తు ప్రారంభించింది. నియోజకవర్గాల పెంపు ప్రక్రియకు ‘గ్రీన్ సిగ్నల్’ ఇచ్చేందుకు వీలుగా కేంద్ర హోంశాఖలో కీలకమైన కేబినెట్ నోట్ సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్వయంగా చెప్పారు.
అసెంబ్లీ స్థానాల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రతిపాదనలొచ్చాయా అని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 170 (3) అధికరణ ప్రకారం 2026 తర్వాత జనాభా లెక్కల వివరాల తర్వాతే సీట్ల పెంపు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. 170 (3) అధికరణ సవరణతోనే అసెంబ్లీ స్థానాల పెంపు సాధ్యమవుతుందని అటార్నీ జనరల్ కూడా న్యాయ శాఖకు ఇదే సలహా ఇచ్చారని పేర్కొన్నారు.
ఏపీలో 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పంచుకునేందుకు విభజన చట్టంలోనే వెసులుబాటు కల్పించారు. ఏపీ విభజన చట్టం ప్రకారం, తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కి పెంచాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అసెంబ్లీ సీట్లు పెంచాలంటూ కేంద్రంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో… అసెంబ్లీ స్థానాల పునర్ వ్యవస్థీకరణకు అవసరమైన ‘పరిపాలనాపరమైన నివేదిక’ ఇవ్వాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖ నుంచి ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు ఒక వర్తమానం అందింది. ఇప్పుడు నియోజకవర్గాల పెంపునకు అవసరమైన సవరణలను సూచిస్తూ కేంద్ర హోంశాఖలో నోట్ సిద్ధమవుతోందని స్వయంగా వెంకయ్య స్పష్టం చేశారు. దీంతో 2019 ఎన్నికల్లోపే ‘పెంచిన సీట్లు’ అందుబాటులోకి రావడం ఖాయమనే అంచనాలు వెలువడుతున్నాయి.