గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా లీగల్ నోటీసులు ఇవ్వడం అందరికీ తెలిసిందే. అయితే ఈ అంశం ప్రస్తుతం సౌత్ ఇండియన్ మ్యూజిక్ లవర్స్ పెద్ద చర్చకే దారితీసింది. తన పాటల్ని వాడుకుంటే రాయల్టీ చెల్లించాల్సిందే అంటూ తేల్చి చెప్పేశారు ఇళయరాజ. అయితే ఈ విషయం బయపడ్డప్పటినుంచి ఒక్కొక్కరు ఒక్కోలా గుసగుసలు మొదలుపెట్టేశారు.
ఇదిలా ఉంటే ఇళయరాజ తీరుతో బాలు బాధపడ్డారన్న విషయం వాస్తవం. అయితే బాలు విషయంలో ఇళయరాజా లీగల్ నోటీసుల దాకా వెళ్లి ఉండాల్సింది కాదని మ్యూజికల్ లవర్స్ అభిప్రాయం. అందుకే ఇప్పుడు మెజారిటీ జనాలు బాలు వైపే ఉన్నారు. తాను సంగీతం సమకూర్చిన పాటను వాడుకుంటున్నపుడు రాయల్టీ చెల్లించాలన్నది నిబంధనల ప్రకారం సమంజసమే కానీ.. బాలుతో ఆయన ఇలా వ్యవహరించి ఉండాల్సింది కాదన్న విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం కూడా ఉంది..ఇళయరాజా రాయల్టీ విషయంలో ఇంతకుముందే తన వైఖరిని స్పష్టం చేశాడు. తమిళ ఎఫ్ఎం స్టేషన్లన్నింటికీ నోటీసులిచ్చాడు. తనకు రాయల్టీ ఇవ్వకుండా తన పాటను వాడుకోవడానికి వీల్లేదని ఆయన తేల్చి చెప్పాడు. ఐతే ఇళయరాజా పాటలన అప్పుడు తమిళ ఎఫ్ ఎం స్టేషన్లన్నీ కూడా ఆయన పాటను ఆపేశాయి. ఇళయరాజా పాటల్ని సీడీలు వేసి అమ్మేవాళ్లు కూడా సైలెంటైపోయారు.
అయితే తాజా పరిణామాలతో ఇక ఏ మ్యూజికల్ షోలోనూ ఇళయరాజా పాటను వాడుకునే సాహసాలు ఎవరూ చేయకపోవచ్చు. ఆర్కెస్ట్రాల వాళ్లు కూడా ఇళయరాజా పాటల విషయంలో భయపడుతున్నారు. రేప్పొద్దున ‘పాడుతా తీయగా’ లాంటి కార్యక్రమాల్లో కూడా ఇళయరాజా పాటలు వినిపించకపోయినా ఆశ్చర్యం లేదు.
పాటలు వాడుకుని రాయల్టీ చెల్లించడానికి చాలామంది ఆసక్తి చూపించకపోవచ్చు. మనదగ్గర ఈ రాయల్టీ లాంటి వ్యవహారాలు నడవవు. కాబట్టి మున్ముందు ఇళయరాజా పాటలు బయటెక్కడా వినిపించకపోవచ్చు. అభిరుచి ఉన్న వాళ్లు వాళ్లంతట వాళ్లు ఇళయరాజా పాటల్ని వినుకోవాలే తప్ప.. బయటెక్కడా ఆయన పాట ప్లే కాకపోవచ్చు. కాబట్టి ఇళయరాజాకు రాయల్టీ రావడం మాటేమో కానీ.. ఆయన పాటకు ఉన్న ప్రాధాన్యం క్రమంగా తగ్గిపోయి.. భవిష్యత్ తరాలకు ఆయన పాట విలువేంటో తెలియకుండా పోయే ప్రమాదమూ లేకపోలేదు.