సంగారెడ్డి జిల్లా, సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజెస్ పార్కులో నెలకొల్పిన ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ సంస్థ సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ (ఎస్ఎంటీ) ఉత్పత్తి ప్లాంట్ మరియు ఆర్&డి సెంటర్‌ను శుక్రవారం పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్‌గా మారిందన్నారు. వైద్యోపకరణాల తయారీ, పరిశోధనల కోసం హైదరాబాద్‌కు ప్రాధాన్యం పెరిగిందన్నారు.
కరోనాతో ప్రపంచం వెనుకబడినా ఎస్ఎంటీ వేగం తగ్గలేదు. ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ, పరిశోధన సంస్థ ఎస్ఎంటీ అని కొనియాడారు. దేశంలో మెడికల్ డివైసెస్ తయారీతో ఔషధాలు, వైద్యోపకరణాల ధరలు తగ్గాయి. బయో ఆసియా సదస్సులో వైద్యోపకరణాల తయారీ సంస్థలను కలిశానని గుర్తు చేశారు. దేశంలో 80 శాతం వైద్యోపకరణాలు విదేశాల నుంచి తెస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
రూ. 530 కోట్లతో నెలకొల్పిన ఈ ఉత్పత్తి ప్లాంట్‌లో దాదాపు 2 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. దీంతో పాటు ఆర్&డి సెంటర్ ద్వారా 300 మంది శాస్త్రవేత్తలకు ఉద్యోగ అవకాశాలు అందనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, టీఎస్ఐఐసి వైస్ చైర్మన్ & ఎండి నర్సింహారెడ్డి, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.