అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా వేల కోట్ల రూపాయలతో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను రూపొందించి అమలుపరుస్తున్నదని తెలిపారు సీఎం కేసీఆర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఈ దేశంలో జన్మించడం భారతజాతి చేసుకున్న అదృష్టమని సీఎం అన్నారు. ఈ సందర్భంగా దేశ పురోగమనానికి పునాదులు వేసిన అంబేద్కర్ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు.
దళిత సాధికారత కోసం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి దేశంలోనే ఎక్కడాలేని విధంగా, దళితబంధు పథకం ద్వారా అర్హులైన దళిత కుటుంబానికి రూ.10లక్షల భారీ మొత్తాన్ని నూటికి నూరు శాతం సబ్సిడీ కింద ఆర్థిక సహాయం అందిస్తున్నదన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల్లో అర్హులైన వారికి 20 లక్షల రూపాయలను స్కాలర్ షిప్‌గా అందిస్తున్నామని చెప్పారు.