ఇటీవల ఏపీ మంత్రి వర్గ విస్తరణ జరిగిన విషయం తెలసిందే. ఇందులో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రి పదవి దక్కింది. ఆమెకు పర్యటక శాఖను కేటాయించారు సీఎం జగన్. ఈ మేరకు బుధవారం రోజా సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. తనపై సీఎం వైఎస్ జగన్కు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పారు. ఏపీలో ఉన్న వనరులను ఉపయోగించి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. వైసీపీని స్థాపించకముందు నుంచే తాను జగన్ అడుగు జాడల్లో నడిచానని చెప్పుకొచ్చారు. ఏపీ మంత్రులుగా ఉన్న వాళ్లంతా జగన్కు సైనికుల్లా పనిచేశారని ఆమె చెప్పారు. జగన్ లాంటి గొప్ప నేతతో కలిసి నడవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆమె భర్త, కుమారుడు, కూతురు, వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు. రోజా బాధ్యతలు స్వీకరించేముందు ఆమెకు భర్త సెల్వమణి గుమ్మడికాయతో దిష్టి తీశారు. రోజా మంత్రి చాంబర్లోని చైర్లో కూర్చున్న అనంతరం ఆమెకు కూతురు ముద్దు పెట్టారు. వైసీపీ నేతలు రోజాకు శుభాకాంక్షలు తెలిపారు.