తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. నేతల మధ్య ఆధిప్యత పోరు ఆగేటట్టులేదనే చెప్పాలి. నిత్యం ఏదో ఒక చోట కాంగ్రెస్ నేతల మధ్య ఆధిప్యత పోరు రగులుతూనే ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నువ్వానేనా అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవలే కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి పిలిపించుకుని కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గపోరుకు బ్రేక్ వేసేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నం చేసినా.. రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీలోని నేతలు ముప్పేట దాడి కొనసాగించిన నేపథ్యంలోనే ఇప్పుడు జిల్లాలల్లో కూడా కాంగ్రెస్ నేతల మధ్య ఆధిప్యత పోరు తారాస్థాయికి చేరింది. నేతలు ఒకరికిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆదిలాబాద్ నుండి మొదలు మహబూబ్ నగర్ దాకా కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు నివురుగప్పిన నిప్పులా ఉందనే చెప్పాలి. అవకాశం దొరికినప్పుడల్లా నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూనే ఉన్నారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు నింపేదుకు నానా తంటాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నిత్యం ఏదో రూపంలో తలనొప్పి వచ్చిపడుతూనే ఉంది. ఒక సమస్యను క్లియర్ చేశాం అని ఊపిరి పీల్చుకునేలోపే మరో సమస్యతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు అధిష్టానానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ఈ మధ్యనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీనేతలను ఢిల్లీకి పిలిపించుకుని సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ. కానీ ఇప్పుడు ఆ ప్రయత్నం విఫల ప్రయత్నంగానే కనిపిస్తోంది. ఢిల్లీలో అగ్రనేతల ముందు కలిపి పనిచేస్తాం అని మెడలు ఊపిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలంగాణకు రాగానే మళ్లీ పాత పద్దతిలోనే కారాలు మిరియాలు నూరుతున్నారు. నువ్వా – నేనా అన్న రీతిలో ప్రత్యర్ధి వర్గంపై దూకుడు పెంచే పనిలో ఉన్నారు.
తాజాగా నల్లగొండ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య వర్గపోరు భగ్గుమంది. అంతా కలిసిపోవాలని అధినాయక్వం సూచించినప్పటికీ ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉన్నది. ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దామోదర్ రెడ్డిపై పార్టీ అధిష్టానానికి తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి అద్దంకి దయాకర్ ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో తుంగతుర్తిలో పార్టీకి నష్టం కలిగించిన డాక్టర్ రవిని ప్రోత్సహిస్తున్నారని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఫిర్యాదు చేశారు. 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయవద్దని రవికి రాహుల్ గాంధీ చెప్పినప్పటికీ పోటీ చేశారని, పార్టీ ఓటమికి కారణమయ్యాడని, దీంతో ఆయనపై పార్టీ నాయకత్వం ఆరేండ్ల పాటు సస్పెండ్ చేసిందన్నారు. అలాంటి వ్యక్తిని మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీలోని నేతల మధ్య వర్గ విభేదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోని వర్గపోరును చల్లార్చే దిశగా అధిష్టానం ఏ దిశగా అడుగులు వేస్తుందో చూడాలి.