బుధవారం హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన 60 డబుల్ బెడ్ రూం ఇండ్లను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇండ్లను లబ్ధిదారులు సర్వాంగ సుందరంగా అలంకరించుకున్నారు. మంత్రి, ఎమ్మెల్యేను లబ్ధిదారులైన మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమాలకు సిఎం కెసిఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ స్థలాల్లో లబ్ధిదారులకు ఇండ్లు నిర్మించి ఇచ్చారన్నారు. త్వరలోనే సొంత స్థలాలు ఉన్నవాళ్ళకు కూడా ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యమన్నారు మంత్రి ఎర్రబెల్లి. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.