ప్యాకేజ్ 27,28, సదర్మాట్ బ్యారేజ్ పనులపై అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నీటిపారుదల, అటవీ శాఖ ఉన్నతాధికారులతో అరణ్య భవన్ లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనుమతుల విషయంలో అటవీ శాఖ నిర్లక్ష్యంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్యాకేజీ 27:
ప్యాకేజీ 27 యూనిట్ -3 పనులను జూన్ లోపు పూర్తి చేసి చెరువులను నింపి ఖరీఫ్‌లో 1500 ఎకరాలకు, వివిధ డైరెక్టరీ తూముల ద్వారా 600 ఎకరాలకు సాగనీటిని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిసెంబర్ 2022 నాటికి 18,000 ఎకరాలకు సాగునీరు అందించాలని ఆదేశించారు. నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి నుంచి మామడ మండలం దిమ్మదుర్తి వరకు 19 కిలోమీటర్ల మేర కెనాల్ తవ్వకం పనులను ఆగస్ట్ లోగా పూర్తి చేసి చేయాలని గడువు విధించారు.
ప్యాకేజీ 28:
భూసేకరణలో జాప్యం, కాంట్రాక్ట్ ఏజెన్సీ అలపత్వం వల్ల ప్యాకేజీ 28 పనుల్లో పురోగతియే లేదని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న ఏజెన్సీ కాంట్రాక్ట్ ను రద్దు చేస్తూ.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఆమోదం పొందిన వెంటనే వేరే టెండర్లు పిలిచి కొత్త ఏజెన్సీకి పనులు అప్పగించాలని మంత్రి ఆదేశించారు.
సదర్మాట్ బ్యారేజ్:
సదర్మాట్ బ్యారేజ్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, 55 గేట్లను బిగించేందికు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. వర్షం కాలంలోగా గేట్ల బిగింపు పనులు పూర్తి చేసి వర్ష కాలంలోగా ఆయకట్టుకు సాగునీరు అందించేలా చూడాలన్నారు.
చెక్ డ్యాంలు:
నిర్మల్ నియోజవర్గంలో రూ.89 కోట్లతో నిర్మించనున్న 15 చెక్ డ్యాంల నిర్మాణానికి త్వరగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, పీసీసీఓఫ్ ఆర్.ఎం. డొబ్రియల్, నీటిపారుదల శాఖ ఇ.ఎన్.సి మురళీధర్ రావు, సీఎఫ్ వినోద్ కుమార్, నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈ సుశీల్ కుమార్, ఈఈ రామారావు, సుశీల్ ఇన్ ఫ్రా, మెఘా, బృంద, రాఘవ ఎజెన్సీల ప్రతినిదులు పాల్గొన్నారు.