ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా గత సంవత్సరం మహబూబ్ నగర్ జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలు కేవలం 10 రోజుల్లో రెండు కోట్ల 8 లక్షల 24 వేల విత్తన బంతులను తయారు చేయడమే కాక వాటితో అతిపెద్ద వాక్యాన్ని రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన విషయం తెలిసిందే.ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడంలో భాగస్వాములైన వారికి అభినందనగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పంపిన సర్టిఫికెట్ల ప్రధానం కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లోని హోటల్ హరిత ప్లాజాలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హజరయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం సంతోషకరమన్నారు. అంతేకాక దేశంలోనే అతిపెద్దదైన 2087 ఎకరాలలో కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ ను చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. విత్తన బంతులతో అతి పెద్ద వాక్యం రూపొందిందించి గిన్నిస్ రికార్డ్ సాధించి దానిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అంకితం చేయడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ అర్బన్ ఎకో పార్కులో మినీ జూ ఏర్పాటు చేసేందుకు తన నిధుల నుండి 50 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ఎంపీ సంతోష్ కుమార్ ప్రకటించారు. జిల్లా మహిళా సంఘాలు 2023లో 3 కోట్ల విత్తన బంతులు తయారు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ,ఆకుపచ్చ తెలంగాణ, తెలంగాణను సస్యశ్యామలం చేయటం వంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర రావు కళలకు ప్రతిరూపంగా అతి తక్కువ కాలంలో జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని చేపట్టాలన్న స్ఫూర్తితో జిల్లాలో గత సంవత్సరం రెండు కోట్ల 8 లక్షల 24 వేల విత్తన బంతులను మహిళా సంఘాలు తయారుచేసి చల్లటం జరిగిందని అన్నారు. అంతేకాక ఆ విత్తన బంతులతో అతిపెద్ద వాక్యాన్ని రూపొందించి జిల్లాకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ రావడం గర్వకారణమని, ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్స్ ప్రధానం చేసి అభినందించారు.
2014లో జిల్లా ఎంతో వెనుకబడి ఉండేదని, ఇప్పుడు జిల్లా రూపురేఖలు మారిపోయాయని, 25 పార్కులను ఏర్పాటు చేశామని, దేశంలోనే అతి పెద్దదైన 2087 ఎకరాలలో కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ తయారు చేశామని మంత్రి చెప్పారు.జిల్లాలో భూగర్భ జలాల పెంపుతో పాటు, పచ్చదనాన్ని పెంపొందించడం జరిగిందని.. భూగర్భ జలాలు పన్నెండు మీటర్ల నుండి ఆరు మీటర్ల మేర పెరిగాయని.. గతంలో వెయ్యి ఫీట్లు తవ్విన నీరు పడేది కాదన్నారు. మహా బ్రాండ్ ఉత్పత్తులు, భూగర్భ జలాల పెంపునకు గాను నిన్ననే జిల్లాకు రెండు స్కోచ్ అవార్డులు వచ్చాయని తెలిపారు. మహిళా సంఘాలు మరోసారి పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణ లోనే అతి పెద్దదైన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ లో త్వరలోనే పక్షుల ఎంక్లోజర్ను ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఈ సందర్భంగా వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ లను సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, డిఆర్డిఓ యాదయ్య, పూర్వపు మెప్మా పిడి శంకరాచారి,డిఐఓ సత్యనారాయణ మూర్తి, డిపిఆర్ ఓ వెంకటేశ్వర్లు,ఏపీ డి శారద, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సురేఖలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్లు లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ వో రంజిత్,డిపిఎం నాగమల్లిక, చెన్నయ్య,అనిల్,సుదర్శన్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.