టీమిండియా లెజెండ్రీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. మాహి టీమిండియాకు టీ20, వన్డే వరల్డ్ కప్ లు అందించడమే కాదు, టెస్టుల్లోనూ జట్టును అగ్రస్థానానికి చేర్చి విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలిచిపోతాడు.. అయితే, ధోనీ అంతర్జాతీయ మ్యాచ్‌లు మొదలు పెట్టిన నాటి నుండి ఇప్పటివరకు జెర్సీ నెంబరు.7నే కొనసాగిస్తున్నాడు. ఆ నెంబరుతో ధోనీకి అవినాభావ సంబంధం ఏర్పడింది. అయితే ధోనీకి ఈ నెంబర్‌కు అంటే ఎందుకు ఇంత ఇష్టమో ఎవరికీ తెలియదు. అందరూ అతడి లక్కీ నెంబర్ 7 అనుకుందటారు. కానీ అలాంటిది ఏమీలేదని ధోని తెలిపాడు.
ఈ నెంబర్‌తో ఉన్న అనుబంధం గురించి ధోనీ తాజాగా వెల్లడించాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధోనీ పాల్గొని మాట్లాడాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన జెర్సీ నెం.7 వెనుక ఎలాంటి మూఢనమ్మకంలేదని స్పష్టం చేశాడు. చాలామంది 7 అనే అంకెను తమ లక్కీ నెంబరుగా చెబుతుంటారని వెల్లడించాడు. అయితే తాను 7 అనే నెంబరు ఉన్న జెర్సీని ధరించడంపై వివరణ ఇస్తూ… తాను పుట్టింది జులై 7న అని తెలిపాడు. ఏడవ నెల, ఏడవ తేదీ… అంతకుమించి మరే కారణమూ లేదని ధోనీ అసలు సంగతి చెప్పాడు. “పైగా నేను పుట్టిన సంవత్సరం కూడా 81. 8 లోంచి 1 పోతే వచ్చేది 7. ఎటు చూసినా ఏడే” అని వివిరించాడు.
పుట్టిన తేదీ కంటే మంచి నెంబరు ఇంకేముంటుందన్న ఉద్దేశం కూడా తన నిర్ణయానికి కారణం అని వెల్లడించాడు. “అయితే చాలామంది 7 అనేది న్యూట్రల్ నెంబర్ అని, దాంతో అది మంచి,చెడులపై ప్రభావం చూపదని చెప్పారు. నాకు నచ్చింది కూడా అదే. 7 అనే నెంబర్ నా హృదయానికి దగ్గరగా ఉంది కాబట్టే దాన్ని జెర్సీపై కొనసాగిస్తున్నాను అని ధోనీ పేర్కొన్నాడు.