ప్రపంచంలో కొత్త వ్యాక్సిన్ రావాలంటే హైదరాబాద్ వైపు చూస్తున్నారని తెలిపారు మంత్రి హరీశ్‌రావు . ఖైరతాబాద్ నియోజకవర్గంలో 50 పడకల పీహెచ్‌సీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా 12 – 14 ఏండ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
దేశంలో కరోనా నివారణకు వచ్చిన మూడు వ్యాక్సిన్లలో రెండు హైదరాబాద్ నుంచి వచ్చినవేనని తెలిపారు. భారత్ బయోటెక్ నుంచి వచ్చిన కొవాగ్జిన్, బయోలాజిక్ ఈ సంస్థ నుంచి వచ్చిన కొర్బెవాక్స్ అని తెలిపారు. బయోలాజిక్ ఈ సంస్థ ఎండీ మహిమా దాట్లకు హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటూ, ప్రభుత్వం భవిష్యత్‌లోనూ ఆమెకు సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు.
థర్డ్ వేవ్‌లో కరోనా ప్రభావం చూపలేదని, టీకా అవసరం లేదనే నిర్లక్ష్య ధోరణి పెట్టుకోవద్దు. చైనా, అమెరికా, హాంకాంగ్‌లో కొత్త కేసులు వస్తున్నాయని వింటున్నాం. డబ్ల్యూహెచ్‌వో కూడా అన్ని దేశాలను అప్రమత్తం చేస్తోంది. వ్యాక్సిన్‌ను ప్రతి ఒక్కరూ విధిగా వేసుకోవాలని హరీశ్‌రావు సూచించారు.
60 ఏండ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలని గతంలో కేంద్రానికి లేఖ రాశాం. ఇందుకు కేంద్రం అంగీకరించిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ రోజు నుంచి 60 ఏండ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోసు ఇస్తామన్నారు.